రేవంత్‌పై పోసాని 'ఫైర్‌.. ఘాటు వ్యాఖ్య‌లు' అని ట్రోల్ చేస్తున్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 3:06 AM GMT
రేవంత్‌పై పోసాని ఫైర్‌.. ఘాటు వ్యాఖ్య‌లు అని ట్రోల్ చేస్తున్నారు

ఎప్పుడూ ఏపీ రాజ‌కీయాల‌పైనే మాట్లాడే పోసాని కృష్ణ‌ముర‌ళి.. ఇటీవ‌ల ఉన్న‌ట్లుండి తెలంగాణ వ్య‌వ‌హారాల‌పై స్పందించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారు అయిన ఆయ‌న‌.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంపై మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులంద‌రి తీరునూ ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఐతే ఈ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌నిప్పుడు విచారం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డిని నొప్పించినందుకు ఫీల‌వుతున్న‌ట్లు చెప్పారు.

ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సారీ అనే మాట వాడ‌లేదు కానీ.. రేవంత్ రెడ్డికి ఆయ‌న దాదాపుగా సారీ చెబుతున్న‌ట్లే ఉంది ఈ ప్ర‌క‌ట‌న సారాంశం. ఇంత‌కీ అందులో పోసాని ఏమ‌న్నారంటే.. ‘‘గత ఆదివారం జరిగిన నా ప్రెస్‌‌మీట్‌లో గౌరవనీయులు ఎంపీ రేవంత్‌ రెడ్డి గారిని వ్వక్తిగతంగా, రాజకీయంగా విమర్శించానని, అలాగే ఘాటు వ్యాఖ్యలు చేశానని వార్తలు వచ్చాయి. అలాగే రేవంత్‌ రెడ్డిపై పోసాని ఫైర్‌.. రేవంత రెడ్డి పై పోసాని ఘాటు కామెంట్స్‌ అని సోషల్‌ మీడియాలోనూ.. యూట్యూబ్‌ చానల్స్‌లోనూ విపరీతంగా ట్రోల్‌ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నేను ఎంతో భాదపడ్డాను. అలాగే ఈ విషయం మీద ఎంపీ రేవంత్‌ రెడ్డి గారు.. ఆయన సన్నిహితులు, ఆయన అభిమానులు మనస్తాపం చెందారని తెలిసింది.

నాకు తెలిసిగానీ.. తెలియక గానీ నా లైఫ్‌‌లో రేవంత్‌ రెడ్డిగారిని వ్వక్తిగతంగా గానీ.. రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. మొన్న జరిగిన ప్రెస్‌ మీట్‌లో కూడా నేను తప్పుగా మాట్లడలేదు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌ లో ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు.. విమర్శతో పాటు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుంది. అలా ఉంటే అది జనం కూడా నమ్ముతారు. జనం గుండెల్లోకి కూడా మీ వార్త చేరుతుంది. అలా అయితే ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడానే తప్ప నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు.

మరీ ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాట్లాడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి కాబట్టి ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి.. ఆయన అభిమానులకు విచారం వ్వక్తం చేస్తున్నాను. ఇది నా తప్పుగానే భావించి.. ఈ తప్పును రెక్టిఫై చేసుకుంటాను’’ అని పోసాని పేర్కొన్నారు.

Next Story