సోనియాతో భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందన్న షర్మిల

వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం

By అంజి  Published on  31 Aug 2023 6:15 AM GMT
YS Sharmila, Sonia Gandhi, Rahul Gandhi, Telangana, YSRTP

సోనియాతో భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందన్న షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీని కలవడం తెలుగు రాష్ట్రాల్లోఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌ పెద్దలను కలవడానికి ఆమె రెండు వారాల కిందట ఢిల్లీ వెళ్లడంతో విలీన ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అప్పుడు సోనియా, రాహుల్‌తో భేటీ కుదరకపోవడంతో తిరిగి వచ్చారు. తాజాగా భర్త అనిల్‌ కుమార్‌తో ఢిల్లీ వెళ్లిన షర్మిల.. నేరుగా సోనియా, రాహుల్‌ గాంధీలతో కలవడంతో విలీన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది.

కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనానికి సంబంధించిన సాధకబాధకాలపై సోనియా గాంధీతో షర్మిల చర్చించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక అని ఆమె సోనియాకు చెప్పారని, ఆ దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం. తెలంగాణకే పరిమితం అవుతానని షర్మిల అభ్యర్థించగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషించాలని సోనియా కోరారని, కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ టిక్కెట్టు ఖాయమని, ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడారు.

తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే రాహుల్‌, సోనియాతో చర్చించినట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా రాజశేఖర్‌ బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిందని వ్యాఖ్యానించారు. అయితే షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వంతో షర్మిల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్న షర్మిల, మరిన్ని వివరాలను తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో షర్మిల కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ విలీనం, షర్మిల పెట్టిన షరతులపై చర్చలు సాగాయి.

Next Story