రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏంటి..?
What is the Congress High Command next step in Komatireddy Raj gopal Reddy issue.తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎమ్మెల్యే
By తోట వంశీ కుమార్ Published on 28 July 2022 11:16 AM ISTతెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. కాంగ్రెస్‌కు బాయ్ బాయ్ చెప్పి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరేందుకు ఆయన రంగం సిద్దం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంత నచ్చజెప్పినప్పటికి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికే ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, తన అనుచరులు, కార్యకర్తలు ఈ విషయంపై ఏమని అనుకుంటున్నారో అని తెలుసుకునే పనిలో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం దాదాపుగా ఖాయం కావడంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని, ఈడీ పిలిస్తే సోనియా, రాహుల్‌గాంధీ విచారణకు వెళ్లాలంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, లు భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డిపై వేటు వేస్తే.. దానివల్ల పార్టీకి లాభమా..? నష్టమా..? అన్న అంశంపై తర్జన భర్జనలు పడినట్లు తెలిసింది.
రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ఉండడం, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలని కాంగ్రెస్ బావిస్తోన్నట్లు కనిపిస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోందని పలువురు నాయకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోతే శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెలుతాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. పార్టీ పరంగా తొలుత చర్యలు తీసుకోవద్దని, ఆయన రాజీనామా చేస్తే వెంటనే రంగంలోకి దిగాలని యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజగోపాల్ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక కనుక వస్తే మునుగోడులో ఆయన కుటుంబం నుంచే ఒకరిని ఆయనపై పోటీకి దించాలనే చర్చ కూడా జరిగింది. భవనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి కావడంతో వెంకట్‌రెడ్డి కి అది కలిసి వస్తుందని అందుకనే ఆయన్నే పోటీకి దించాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. అయితే.. ఇందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంగీకరిస్తాడా ..? అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ అన్నదమ్ములు పోటీ పడితే రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.