తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం.. నేను నిత్య విద్యార్థిని

TTDP Leader L Ramana Press Meet. టీఆర్ఎస్‌లో చేరుతున్నార‌నే వార్త‌ల‌పై టీటీడీపీ నేత‌ ఎల్. రమణ క్లారిటీ ఇచ్చారు. సోమ‌వారం మీడియా

By Medi Samrat  Published on  14 Jun 2021 8:11 AM GMT
తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం.. నేను నిత్య విద్యార్థిని

టీఆర్ఎస్‌లో చేరుతున్నార‌నే వార్త‌ల‌పై టీటీడీపీ నేత‌ ఎల్. రమణ క్లారిటీ ఇచ్చారు. సోమ‌వారం మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తాను పదవులకోసం పాకులాడే వ్యక్తిని కానని అన్నారు. పార్టీ మారడం పై పార్టీ కార్యకర్తలతో చర్చించి పూర్తి వివరాలు అందిస్తాన‌ని తెలిపారు. నేను ఎప్పుడూ పదవినీ ఆశించలేదని.. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నా నాయకుడిన‌ని ఆయ‌న అన్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మమ్మల్ని నమ్మి ఓటు వేసిన ఓటర్ల‌కు మా వంతు కృషి చేస్తున్నామ‌ని.. టీఆర్ఎస్ తో ఎలాంటి చర్చలు జరపలేదని స్ప‌ష్టం చేశారు. ఎప్పుడూ నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకొనే ముందుకు సాగానని.. 27 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నానని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చoద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నానని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయమ‌ని.. నేను నిత్య విద్యార్థినే అని ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తి అవాస్తవమ‌ని.. ఏమైనా ఉంటే మీడియా ద్వారా సమాచారం అందిస్తామ‌ని తెలిపారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.. మార్చుకుంటున్న అందరి ఆలోచనల దిశతోనే నిర్ణయం తీసుకుంటాన‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ బీసీ అభ్యర్ధిగా ఆ ప్రయోగం చేస్తారని భావించలేదని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర‌స్తుతం కొవిడ్ వంటి ప్రత్యేక‌ పరిస్థితుల్లో ఉన్నాయ‌ని.. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రం, ఫ్రీ వ్యాక్సిన్ పేరుతో కేంద్రం అని ఒకోక్కరు ఒక్కో విధంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయాన్ని గౌరవిస్తానని.. నేను ఎవరిని అగౌరవ ప‌రుచ‌న‌ని రమణ అన్నారు.


Next Story