మునుగోడులో ఏ వర్గం ఎవరి వైపు..?

They are the MLA's in the past till now in Munugodu.తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక‌పైనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 11:02 AM GMT
మునుగోడులో ఏ వర్గం ఎవరి వైపు..?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక‌పైనే ఉంది. ఇప్ప‌టికే అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. వారు నామినేష‌న్లు కూడా దాఖ‌లు చేశారు. ప‌లు ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థుల‌తో పాటు స్వతంత్య్ర అభ్య‌ర్థులు మొత్తం 47 మంది ఉప ఎన్నిక బ‌రిలో ఉన్నారు. వీరంతా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రీ వీరిలో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో ప్ర‌స్తుతానికైతే తెలియ‌దుగానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు మునుగోడులో ఏ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారో ఓ సారి చూద్దాం..

1967లో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగానే ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డ‌ జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్‌, ఐదు సార్లు సీపీఐ, ఒక సారి టీఆర్ఎస్ పార్టీలు విజ‌యం సాధించాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్, సీపీఐ పార్టీలే ప్రధానంగా పోటీ ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి నియోజ‌క వ‌ర్గం ఏర్ప‌డిన నాటి నుంచి అక్క‌డ కాంగ్రెస్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటి చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1967లో సీపీఐ అభ్య‌ర్థి ఉజ్జిని నారాయణరావుపై, 1972లో, 1978లో కంచర్ల రామకృష్ణారెడ్డి జ‌న‌తా పార్టీ పై, 1983లో బొమ్మగాని ధర్మబిక్షంపై గెలుపొందారు. వ‌రుస‌గా నాలుగు సార్లు ఆయ‌నే విజ‌యం సాధించ‌డంతో కాంగ్రెస్ కోట‌గా మునుగోడు మారింది.

అయితే కాంగ్రెస్ విజ‌యాల‌కు సీపీఐ అడ్డుక‌ట్ట వేసింది. 1985లో సీపీఐ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన‌ ఉజ్జిని నారాయణ రావు మునగాల నారాయణరావుపై విజ‌యం సాధించారు. త‌రువాత మ‌రో రెండు సార్లు 1989, 1994ల‌లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై నారాయ‌ణ రావు గెలుపొందారు. అయితే.. 1999 ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి గోవర్థన్ రెడ్డి టీడీపీ అభ్య‌ర్థి జేల్లా మార్కండేయపై గెలిచారు. 2004లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి విజ‌యం సాధించ‌గా.. 2009లో సీపీఐ పార్టీ తరపున పోటీ చేసిన ఉజ్జిని యాదగిరి రావు గెలిచి మునుగోడు గడ్డపై మరోసారి తమ‌కు తిరుగులేద‌ని నిరూపించారు కమ్యూనిస్టులు.

ఇక..రాష్ట్ర విభ‌జ‌న వ‌రకు ప‌రిస్థితులు ఎలా ఉన్నా.. విభ‌జ‌న త‌రువాత అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ తొలి సారి మునుగోడులో జెండా ఎగుర‌వేసింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్వాయి స్ర‌వంతిపై విజ‌యం సాధించారు. దీంతో అక్క‌డ కారు పార్టీకి ఆశ‌లు చిగురించాయి. అయితే.. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌పై విజ‌యం సాధించారు.

ఏ వ‌ర్గం ఎంతంటే.

మునుగోడు గ్రామీణ నియోజకర్గం. అందులోనూ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కంటే బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గమని చెబుతారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మునుగోడులో గౌడ్ లు అత్యధికంగా 36 వేల మంది ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజ్‌లు 34 వేలు, మాదిగలు 26 వేలు, యాదవులు 22 వేలు మాలలు 12 వేలు గిరిజనులు 11 వేలు ఉన్నారు. వీరంతా పదివేల సంఖ్య పైబడి ఉన్నారు. ఇక పది వేలలోపున వడ్డెరలు 9 వేలు, కుమ్మరులు 9వేలు, విశ్వబ్రాహ్మణులు 9 వేలు, ముస్లింలు దాదాపు 10 వేల వ‌ర‌కు ఉన్నారు. అయితే అత్యధిక సార్లు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా దాదాపు ప‌ది వేలు ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం వారు ఏడు వేలు, ఆర్య వైశ్య మున్నూరు కాపు వెలమ వంటి కులాల వారు 4 వేల చొప్పున ఉన్నారు.

ఇక్కడి నుంచి 1990ల్లో బీసీ అభ్యర్థులు ఎవరికీ పోటీకి అవకాశం ద‌క్క‌లేదు. రెడ్డి, వెలమ నాయకత్వమే అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచింది. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల ఓట్ల వాటా 64 శాతం దాకా ఉంది. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన పార్టీలు బీసీయేత‌ర అభ్య‌ర్థులను నిల‌బెట్ట‌గా.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నేతృత్వంలోని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ, ప్రొపెస‌ర్ కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జ‌న‌స‌మితి బీసీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపాయి. మూడు ప్ర‌ధాన పార్టీలు బీసీల‌ను విస్మ‌రించాయ‌న్న అంశాన్నే ఈ రెండు పార్టీలు ప్ర‌ధానంగా ప్ర‌చారం చేస్తున్నాయి.

అయితే బీసీ సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉన్నా త‌మ కులం అభ్య‌ర్థికే ఓటు వేస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే గ‌తంలో త‌క్క‌వ సంఖ్య గ‌ల సామాజిక వ‌ర్గం నేత‌లే పాలించారు గ‌నుక‌. మ‌రి ఉప ఎన్నిక బ‌రిలో ఉన్న వారిలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story