AP: కూటమి అభ్యర్థుల రెండో జాబితా ఆ తర్వాతే?
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
By అంజి Published on 10 March 2024 6:14 AM GMTAP: కూటమి అభ్యర్థుల రెండో జాబితా ఆ తర్వాతే?
ఏపీ: తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. మార్చి 9, శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ చర్చల అనంతరం ఏయే స్థానాల్లో పోటీ చేయాలనేదానిపై ఒక క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఆ తర్వాతే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేస్తాయని వివరించాయి. దీంతో సీట్ల షేరింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జనసేన, బీజేపీలతో సీట్లను పంచుకోవాలని టీడీపీ నిర్ణయించిందని నాయుడు వివరించారు. సీట్ల పంపకంపై స్పష్టత ఉందని, అయితే మరో దఫా చర్చల తర్వాత సీట్లను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.టీడీపీ, జనసేనలు గత నెలలో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ప్రకటించాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 24, 25 లోక్‌సభ స్థానాలకు గాను మూడు స్థానాలను జనసేనకు టీడీపీ వదిలేసింది. టీడీపీ కూడా 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా, జనసేన ఐదుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయొచ్చేనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థులపైనా స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురందీశ్వరి, నరసాపురం - రఘురామరాజు, తిరుపతి - రత్నప్రభ, రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపురం - సత్యకుమార్ పోటీ చేయనున్నట్టు సమాచారం. అలాగే ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. కాగా, పార్టీల బలాబలాల ఆధారంగా సీట్లను నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరించడంపై 2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కూటమిని పునరుద్ధరించాలని ఆసక్తి చూపింది. అయితే, జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం మరియు పార్లమెంటులో అనేక కీలక బిల్లులను ఆమోదించడంలో మద్దతు ఇవ్వడంతో బిజెపి టిడిపితో పొత్తుకు ఆసక్తి చూపలేదు.