బండి సంజయ్ నీకు దమ్ముంటే.. కేంద్రంతో ధాన్యం కొనిపించు : మంత్రి ప్రశాంత్ రెడ్డి
Telangana Ministers fires on BJP over Paddy procurement.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రోడ్లు, భవనాల శాఖ
By తోట వంశీ కుమార్ Published on 26 March 2022 7:52 AM GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ మగాడైతే కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలన్నారు. ధ్యానం కొనుగోలుపై ఇటీవల మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి లు పాల్గొని మాట్లాడారు.
పంజాబ్‌లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయితే.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలు కనుమరుగైపోవడం ఖాయమని చెప్పారు. బండి సంజయ్ మెడకి, నాలుకకి లింక్ కట్ అయినట్లుగా ఉంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండి పడ్డారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని బండి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. బండి సంజయ్ మగాడైతే.. కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించాలని సవాల్ చేశారు.
బండి సంజయ్ నీకు దమ్ముంటే… కేంద్రంతో ధాన్యం కొనిపించు - మంత్రి శ్రీ @VPRTRS. pic.twitter.com/dTIfSWLcO0
— TRS Party (@trspartyonline) March 26, 2022
ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఆహ్వానించలేదన్నది అబద్ధమన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వాలని తమ మెడమీద కత్తిపెట్టి రాయించుకున్నారని మండిపడ్డారు. ప్రతినెల 10 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చే కెపాసిటీ తెలంగాణకు ఉందన్నారు. కానీ కేంద్రం 2 లక్షల టన్నులకు మించి తీసుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అని కన్ఫ్యూజ్ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాము వడ్లు ఇస్తామని.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టమన్నారు. కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని.. రైతు ల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. తాము ఇన్ని సార్లు పియూష్ గోయల్‌ను కలిస్తే.. ఒక్కసారి అయినా కిషన్ రెడ్డి వచ్చారా అని ఆయన నిలదీశారు. ఉగాది తర్వాత ఉధృతమైన ఉధ్యమం చేస్తామన్నారు. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయిందన్నారు. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయమన్నారు.