Telangana: ఓటమి భయంతోనే.. కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా?

నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే సంకేతాలను కేసీఆర్‌ పసిగట్టారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

By అంజి  Published on  28 Oct 2023 11:52 AM IST
Telangana elections, BRS, KCR, Congress

Telangana: ఓటమి భయంతోనే.. కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా?

నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే సంకేతాలను భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పసిగట్టారా? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణలోని రాజకీయ వర్గాలు. వివిధ చోట్ల ఎన్నికల ర్యాలీలలో కేసీఆర్ తన ప్రసంగాలలో అభద్రతా భావంతో ఉన్నట్టు కనిపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం అచ్చంపేట బహిరంగ సభలో, అంతకుముందు సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత కాంగ్రెస్ హయాంలో చూసిన రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టవద్దని, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేశారు. ''వచ్చే ఎన్నికల్లో మీరు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తే నాకు ఒరిగేదేమీ లేదు. ఇంటికి వెళ్లి వచ్చే ఐదేళ్లు సంతోషంగా విశ్రాంతి తీసుకుంటాను. కానీ మీరు బాధపడతారు. తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చిన బీఆర్‌ఎస్‌ను ఓడిస్తే మళ్లీ చీకటి యుగాలకు వెళ్లిపోతారని మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యత'' అని అన్నారు.

''ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్దఎత్తున వాగ్దానాలతో తమ వద్దకు చేరుకుంటారని, వారి మాటలు నమ్మడం మొదలుపెడితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చి తెలంగాణ కుక్కల పాలవుతుందని కేసీఆర్ అన్నారు. నేను అప్పుడు ఏమీ చేయలేను. మీ కోసం పోరాడలేను'' అని అన్నారు. తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేశానని, ప్రగతి, అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాల్సిన తరుణం ఇప్పుడు వచ్చిందన్నారు.

"మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు మా ప్రభుత్వ గత తొమ్మిదిన్నర సంవత్సరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చండి" అని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ తన ప్రసంగాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండేవారని, తన పార్టీ ఓటమిపై ఎప్పుడూ మాట్లాడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. “కానీ నేటి ర్యాలీలలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం గురించి ప్రజలను హెచ్చరించాడు. ఇది ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉంది’’ అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Next Story