సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 7:50 AM GMT
telangana, brs, ktr, challenge,  cm revanth reddy,

 సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ 

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను కేటీఆర్ చంచల్‌గూడ జైలులో కలిశారు. ఆయనతో ములాఖత్‌ అయి ఆయనపై పెట్టిన ఫోర్జరీ కేసు గురించి చర్చించారు. మన్నె క్రిశాంక్‌ ఆరోగ్యంతో పాటు ఇతర విషయాలపైనా మాట్లాడారు. ఇక ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌ విసిరారు. నిజంగా దమ్ము ఉంటే ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. క్రిశాంక్‌ పెట్టిన సర్క్యులర్ నిజమో.. మీరు పెట్టిన సర్క్యులర్ నిజమో నిపుణుల ముందు ఉంచి తేల్చుదామని అన్నారు. ఏది ఫోర్జరీ.. ఏది ఒరిజినల్‌ అనేది తేలుద్దామంటూ చెప్పారు. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడ జైలులో కూర్చోవాలో నిర్ణయం తీసుకుందామన్నారు. క్రిశాంక్ పోస్టు చేసిన స‌ర్క్యుల‌ర్ త‌ప్పా..? అని ప్ర‌శ్నించారు. చేయని తప్పుకి క్రిశాంక్‌ను జైల్లో వేశారని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన పిచ్చి పనికి.. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అధికారంలో ఉన్నామని.. అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి దానికి బదులు చెబుతామనీ.. ప్రతి అంశానికి మిత్తి సహా సమాధానం ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఇక క్రిశాంక్‌ కూడా జైలులో ధైర్యంగా ఉన్నారని చెప్పారు. వారం రోజుల పాటు జైలులో ఉన్నా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలని అన్నారు. క్రిశాంక్‌ను విడుదల చేయకపోతే.. రెండు సర్క్యులర్‌లను ఒకదగ్గర పెట్టి అసలైనది ఏదో తేల్చుకుందామంటూ మరోసారి కేటీఆర్ పేర్కొన్నారు.


Next Story