హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై రేవంత్ ఏమన్నారంటే..
Revanth Reddy About Huzurabad Bypoll Result. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిరాశపరిచిందని టీపీసీసీ
By Medi Samrat Published on 2 Nov 2021 5:53 PM ISTహుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిరాశపరిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఉప ఎన్నిక ఫలితాల వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశచెందవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. వెంకట్‌కు మంచి భవిష్యత్తు ఉందని.. కాంగ్రెస్ పార్టీకి వెంకట్ మంచి లీడర్ అవుతారని రేవంత్ అన్నారు. వెంకట్ హుజురాబాద్ ప్రజల కోసం భవిష్యత్తులో పోరాటం చేస్తాడని.. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత నాదేనని రేవంత్ అన్నారు.
ఫలితంపై నివేదికలు తెప్పించుకొని విశ్లేచన చేసుకుంటామని.. రాబోయే రోజులన్ని కాంగ్రెస్ పార్టీవేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతామని.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయని అన్నారు. ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేదని.. గత ఎన్నికల్లో బీజేపీకి 16 వందల ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఇప్పుడు గెలిచిందని.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిందని గుర్తుచేశారు.
ఈ ఓటమి నన్ను కుంగ తీయదని.. మీ కోసం నేను ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. హుజురాబాద్ ఫలితాలు- ఎన్నికపై భవిష్యత్ స్పందిస్తానని రేవంత్ తెలిపారు. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదని.. నిరాశ నుంచి నిర్మాణం చేపడుతామని రేవంత్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని.. పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుని.. సీనియర్లను పార్టీ కార్యక్రమాల్లో కలుపుకుని వెళతాం అని రేవంత్ రెడ్డి అన్నారు.