'అది అవినీతిపరుల సమావేశం'.. విపక్షాల భేటీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులో విపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.

By అంజి  Published on  18 July 2023 8:15 AM GMT
Prime Minister Modi, Opposition parties, National news, Congress

'అది అవినీతిపరుల సమావేశం'.. విపక్షాల భేటీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులో విపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అది అవినీతిపరుల సమావేశమన్నారు. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని అంటూ సంచలన ఆరోపణలు చేశారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీని ఢీకొట్టేందుకు వ్యూహరచన చేసేందుకు బెంగళూరులో జరిగిన కీలక సమావేశానికి విపక్షాల అగ్ర పక్షాలు హాజరైన తరుణంలో ప్రధాని మోదీ ఈ మాటల దాడి చేశారు. మంగళవారంనాడు పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని కొత్త ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలన, విపక్షాల భేటీలపై సెటైర్లు పేల్చారు. పాత ప్రభుత్వాల తప్పిదాలను తమ ప్రభుత్వం సరిదిద్దిందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వలాభం కోసమే విపక్షాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. గడిచిన తొమ్మిదేళ్లలో దేశాన్ని తాము ఎంతో అభివృద్ధి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్‌లలో ఏర్పాటు చేసిన కొత్త టెర్మినల్‌ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గత యూపీఏ పాలనలో దేశ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తుంటాయన్న ప్రధాని మోదీ.. ఆ కుటుంబాలను కాపాడుకోవడమే వారి ప్రధాన లక్ష్యం అన్నారు.

బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమవేశంపై ఆరోపణలు చేశారు. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం అవినీతిని ప్రోత్సహించే సభ అని అన్నారు. అభివృద్ధి కాకుండా కుటుంబాలను కాపాడుకోవడానికే కొన్ని పార్టీ పని చేస్తుంటాయని వారి తాపత్రయం కూడా అదేనన్నారు. కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము మాత్రం దేశం కోసం ఆలోచిస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ పార్టీలు ఏనాడూ యువత గురించి ఆలోచించలేదన్నారు. యూపీఏ హయంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారని మోడీ పేర్కొన్నారు.

Next Story