ఏపీ తదుపరి ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్.. కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు
Political Discussion Over Jr Ntr Political Entry. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను
By Medi Samrat Published on 29 Dec 2020 1:00 PM ISTప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను హీటెకిస్తోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టింది. టీడీపీ పార్టీని ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరువాత ఆ పార్టీని నడిపించే వారెవరు అన్న ప్రశ్న అందరిలోనూ ఉన్నది. ఆయన తనయుడు నారా లోకేష్ పార్టీని నడిపిస్తాడని బావించినా.. చంద్రబాబులా నాయకత్వ లక్షణాలు లోకేష్‌లో లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానుల బలమైన కోరిక. అయితే.. దీనిపై ఎన్టీఆర్ మౌనంగానే ఉంటున్నాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏపీ తదుపరి ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. టీడీపీ నేతలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకులు, కేడర్లలో ఈ ఫెక్సీలపై జోరుగా చర్చనడుస్తోంది. దీన్ని ఎవరు స్పాన్సర్ చేసారో.. ఎవరు ఏర్పాటు చేశారో అన్నది బహిరంగంగా చెప్పడం లేదు. కానీ అది ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిని.. అసమ్మతి గళాలకు నిదర్శనమని పేర్కొంటున్నారు. టిడిపిలో ఇబ్బందులు సృష్టించడానికి టిడిపి ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని పలువురు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఏదీఏమైనప్పటికీ.. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలా ఇబ్బంది కలిగించింది. ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఎటునుంచి ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి మరీ.