ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో వీరు భేటీ అయ్యారు. పవన్‌తో జనసేనలో చేరిక విషయమై, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బాలశౌరి చర్చలు జరిపారని సమాచారం. వారం రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. బాల శౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పవన్, బాల శౌరి ఇద్దరూ చర్చించారు. బాల శౌరి రాజీనామాతో మొన్న కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది.
బాల శౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా లేక గుంటూరు నియోజకవర్గంపై దృష్టి సారిస్తారా అనేది ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై చర్చలు కొనసాగుతున్నాయి. కాగా బాలశౌరి మచిలీపట్నం లోక్ సభకు 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఇటీవల రాజీనామా చేశారని చెప్పుకుంటున్నారు.. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌తో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. ఈ రెండు కారణాలతో వైసీపీకి రాజీనామా చేసి ఉండొచ్చు.