ఆరోపణలు రుజువు చేస్తే.. రాజీనామాకు సిద్ధం : రోహిత్ రెడ్డి
MLA Rohith Reddy Fires on BJP Leaders.తనపై చేస్తున్న ఆరోపణలు నిజం అని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్దం
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2022 1:07 PM ISTభారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలు నిజం అని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. కర్ణాటక డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే నిరూపించాలని, భాగలక్ష్మీ అమ్మవారి ఆలయానికి తడి వస్త్రాలతో వచ్చి ప్రమాణం చేయాలని శనివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పైలట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. తన సవాల్‌ను బండి సంజయ్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకు అర్థమైందన్నారు. హిందుత్వం పేరుతో సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారన్నారు.
'డ్రగ్స్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ నాయకులు నాపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. వారిని ఎదిరిస్తే ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారన్నారు.
తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపైనా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తాను బండి సంజయ్ కు సవాల్ చేస్తే ఆయన తరఫున రఘునందన్ రావు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. రఘునందన్ రావు గతంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డరన్నారు. వందల కోట్ల ఆస్తులను రఘునందన్ రావు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.