జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం చేసిన పవన్.. చిరంజీవికి ఎందుకు నమస్కారం చేయలేదు..? అసలు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఉండేవారా..? అంటూ ప్రశ్నించారు. పవన్.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లను కలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యమన్నారు.
టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నాడని, పవన్ ఎప్పుడెప్పుడు టీడీపీలోకి వస్తాడా అని ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సినిమా డైలాగులనే జనసేన సభలో పేల్చారని పవన్‌పై మంత్రి సెటైర్లు వేశారు. పవన్‌కు సినిమా డైలాగ్‌లు తప్ప మరేమీ తెలియవన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్ గుర్తించాలన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా..? విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగలేరా..? అని నిలదీశారు. విశాఖ ఉక్కును అమ్మేయవద్దని ఢిల్లీ వాళ్లను పవన్ కల్యాణ్ నిలదీయాలి కదా..? అంటూ వ్యాఖ్యానించారు. ఆడ మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చెయ్యొచ్చా..? అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మీద ద్వేషమే పవన్ సింగిల్ పాయింట్ అజెండా అంటూ చెప్పుకొచ్చారు. ఏపీకి పవన్ కళ్యాణ్ గెస్ట్ టూరిస్ట్ అని మంత్రి పేర్ని నాని అన్నారు.