ప‌వ‌న్‌కు కొడాలి నాని కౌంట‌ర్‌.. వ‌కీల్‌ సాబ్ కాదు ఆయ‌న..

Kodali Nani Counter To Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్ల‌పై ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల

By Medi Samrat  Published on  29 Dec 2020 8:40 AM GMT
ప‌వ‌న్‌కు కొడాలి నాని కౌంట‌ర్‌.. వ‌కీల్‌ సాబ్ కాదు ఆయ‌న..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్ల‌పై ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌మంత్రి కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జరిగిన పేదలందరికీ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో క‌లిసి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ప‌వ‌న్‌పై ఫైర్ అయ్యారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పేకాట క్ల‌బ్‌ల‌ను మూసివేయిస్తోంద‌న్నారు. ఎక్క‌డా ప్రోత్స‌హించ‌డం లేద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌ను తోసిపుచ్చిన నాని.. బాధ్య‌త గ‌ల మంత్రిగా ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పేందుకే స్పందిస్తున్నామ‌న్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ను తాను వ‌కీల్‌ సాబ్ అనుకుంటున్నార‌నీ.. కానీ జనాలు మాత్రం ఆయ‌న్ను ష‌కీలా సాబ్‌గా బావిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. పేర్ని నానిని, నన్ను బోడి లింగాలు అంటూ కామెంట్ చేసిన పవన్‌ కల్యాణే పెద్ద పెద్ద బోడి లింగం అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. తామిద్దరం శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారన్న ఆయన.. పవన్ కల్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారంటూ సెటైర్లు వేశారు.

పవన్ కల్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని కొడాలి నాని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమన్నారు. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. ప‌వ‌న్‌ను సినిమాలు ఆపాల‌ని ఎవ‌రూ కోర‌లేద‌ని.. త‌నంత‌ట తానే స్వ‌యంగా సినిమాలు ఆపేస్తున్న‌ట్లు గ‌తంలో ప్రక‌‌టించార‌ని గుర్తు చేశారు.

కాగా.. నిన్న గుడివాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ కూడలిలో ఆయన ప్రసంగిస్తూ.. మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు... శతకోటి నానీల్లో ఒక నాని అంటూ ఎద్దేవా చేశారు.

Next Story