టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నాయకత్వంతో అంటీ అంటనట్టు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జోరందుకుంది. విజయవాడ కేశినేని భవన్ లోని ఆయన పార్లమెంటు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించడం హాట్ టాపిక్ అయింది. ఆయనతో పాటు పార్టీలోని మరికొందరు ముఖ్యనేతల ఫొటోలను కూడా పక్కనపెట్టారు. చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్ టాటాతో తాను కలిసున్న ఫొటోను ఏర్పాటు చేశారు. కేశినేని నాని టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధపడే ఈ పని చేశారని మాట్లాడుకుంటున్నారు.
ఏడు నియోజకవర్గాల ఇంచార్జులు, నేతల స్థానంలో గత ఐదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను నాని ఏర్పాటు చేశారు. పార్టీలో తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వలేదని కేశినేని నాని కొంత కాలంగా అలక వహించారనే ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒకవేళ ఆయన పార్టీ మారితే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరతారా.. లేక వైసీపీలోకి వెళతారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఢిల్లీలో బీజేపీ జాతీయనేతలతో ఆయన మాట్లాడుతున్నారని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నాని వర్గం నుండి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు.