ఉప ఎన్నిక జరిగితే మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే..!

If the by-election is held it will be prestigious for all three parties.తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం మునుగోడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2022 8:27 AM IST
ఉప ఎన్నిక జరిగితే మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే..!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం హాట్‌టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న గుడ్ బై చెప్పే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదే అదునుగా ఆయ‌న్ను పార్టీలో చేర్చుకోవాల‌ని క‌మ‌ల‌నాథులు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ఒక‌వేళ రాజ‌గోపాల్ రెడ్డి భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేరితే హుజూరాబాద్‌, దుబ్బాక‌లో విజ‌యం సాధించిన‌ట్లుగానే మునుగోడులోనూ ఉప ఎన్నిక‌కు వెళ్లి స‌త్తా చాటాల‌ని బీజేపీ బావిస్తోంది. ఉప ఎన్నిక వ‌స్తే మాత్రం ఈ ఎన్నిక టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీకి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారే అవ‌కాశం ఉంది. ఎందుకంటే వ‌చ్చే సంవ‌త్స‌రం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌జ‌లు త‌మ పార్టీ వైపే ఉన్నార‌నే సంకేతాలు పంపాల‌ని అన్ని పార్టీలు బావిస్తున్నాయి.

కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి గ‌త రెండు, మూడేళ్లుగా రాజ‌గోపాల్ రెడ్డి పార్టీతో అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న, పిలుపునిస్తున్న ఏ కార్య‌క్ర‌మంలో ఆయ‌న దాదాపుగా క‌నిపించ‌డం లేదు. బీజేపీ అగ్ర‌నాయ‌కుల్లో ఒక‌రైన అమిత్‌షా తో ట‌చ్ లో ఉంటూ కాంగ్రెస్‌పైనే ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు చేశారు. వారం రోజుల క్రితం అమిత్ షాతో మ‌రోసారి రాజ‌గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో వీరి ఇరువురి మ‌ధ్య రాష్ట్ర రాజ‌కీయాలు, బీజేపీలో చేరే అంశంపై చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో మ‌రోసారి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు నియోజకవర్గం వైపు మళ్లాయి.

ప‌లు సంద‌ర్భాల్లో విలేక‌రుల‌తో రాజ‌గోపాల్‌రెడ్డి మాట్లాడిన అంశాల‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ల‌ను ప‌రిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మ‌రోవైపు రాష్ట్ర నాయకులెవ్వరూ కనీసం రాజగోపాల్‌ వ్యాఖ్యలను ఖండించకపోవడం, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేయకపోవడం గమనార్హం.

మొద‌లైన ఉప ఎన్నిక క‌స‌ర‌త్తు..?

రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే అప్పుడు ఉప ఎన్నిక త‌ప్ప‌దు. దీనిపై కూడా అన్ని పార్టీలు దృష్టి సారించాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చే ఉప ఎన్నిక కావ‌డంతో అన్ని పార్టీలు ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై ఆయా పార్టీల నాయ‌కులు స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిస్థితులు, ప్ర‌జాభిప్రాయం అంశాల‌పై బీజేపీ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న నిర్వ‌హిస్తోంది. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు..? రాజ‌గోపాల్ రెడ్డి వైఖ‌రిపై ఎలాంటి అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ టీఆర్ఎస్ ప‌రిస్థితి ఏమిటి..? అన్న అంశాల‌పై బీజేపీ లోతైన అధ్య‌య‌నం చేయిస్తోంది.

మ‌రోవైపు తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డితో పాటు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ముఖ్య‌నాయ‌కుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. మునుగోడు ప‌రిస్థితిపై ఆరా తీశారు. హుజూరాబాద్‌లో పరాజయంతో ఎదుర్కొంటున్న విమర్శలకు దీటుగా జ‌వాబు ఇవ్వాల‌నే యోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎంతోకాలంగా గట్టుప్ప‌ల్ మండ‌ల కేంద్రంగా చేయాల‌న్న అక్క‌డి ప్ర‌జ‌ల డిమాండ్‌ను నేర‌వేరుస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

మిగ‌తా ఉప ఎన్నిక‌ల‌కు భిన్నం

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు ఏదో ఒక ప్రాధాన్య‌త ఉంది. ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఎంపీగా గెల‌వ‌డంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మ‌ర‌ణాల‌తో నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేంద‌ర్ తొల‌గింపు, రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే.. వీటి అన్నింటికి మునుగోడు భిన్నంగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఉప ఎన్నిక కోరుకోవ‌డం లేదు. దీంతో కేవ‌లం రాజ‌కీయ బ‌లాబ‌లాల‌ను నిరూపించుకునేందుకు ఉప ఎన్నిక జ‌రిగితే ప్ర‌జ‌లు ఏ విధ‌మైన తీర్పు ఇస్తార‌నేది అస‌క్తిరంగా మారింది.


Next Story