తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Sept 2023 12:59 PM IST
BRS, Gutha Sukender Reddy,  BJP, Congress, Telangana,

 తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్‌లో రక్తపుటేరులు పారిన సంఘటనలపై ఇప్పటికీ మోదీ మాట్లాడుతున్నారని అన్నారు. 2003లో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలదేని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావుతో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ, ఇన్నీ కావని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి 1969లో తెలంగాణ ఇవ్వలేదని, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ అలుపెరుగని పోరాటంతో దిగివచ్చిన కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచారని అన్నారు. ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయ్యిందని స్పష్టం చేశారు. మోదీ మనసు నిండా విషం ఉందని, ప్రధాని మాట్లాడే దాంట్లో అర్థం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. పువ్వు గుర్తు పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. అందుకే మళ్లీ మహిళ రిజర్వేషన్ బిల్లు అంటూ హడావిడి చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోందని అన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. అమలుకు వీలుకాని హామీలు ఇస్తూ మోసం చేయాలని చూస్తోందని అన్నారు. గ్యారంటీ హామీలన్నీ ఉత్తివేనని.. అధికారంలోకి వచ్చేందుకు వేస్తున్న ఎత్తుగడలని చెప్పారు. అయితే.. ఇక్కడ చెబుతున్న హామీలన్నీ కాంగ్రెస్‌ అధికాంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. తెలంగాణలో ఏం చేయాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అని.. ఇప్పటికే అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలబడిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు విజన్ లేదని.. వారికి అధికార దాహం మాత్రమే ఉందని విమర్శించారు. గ్యారంటీ హామీల్లో రూ.2 లక్షల రుణమాఫీని ఎందుకు మర్చిపోయారని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మొద్దని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.

Next Story