బల్దియాతో ప్రారంభించి.. తిరుగులేని నేతలుగా ఎదిగింది వీళ్లే..
GHMC Elections Special. జీహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైంది. బలమైన రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా భావించే హైదరాబాద్
By Medi Samrat Published on 20 Nov 2020 5:20 AM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైంది. బలమైన రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా భావించే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను.. కొంతమంది నేతలు గతంలో తమ రాజకీయ ఎదుగుదలకు వేదికగా మలుచుకున్నారు. కార్పొరేటర్లుగా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల వరకూ వెళ్లారు. అందులో ముఖ్యంగా పలువురి నేతల గూర్చిన వివరాలు తెలుసుకుందాం..
సలావుద్దీన్ ఒవైసీ.. ఎంఐఎం నేత. 1960లో మల్లేపల్లి డివిజన్ నుంచి గెలిచి కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అనంతరం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు ఎంపీగా గెలిచి రాజకీయాల్లో రాణించారు. ప్రస్తుత ఎంఐఎం నేతలైన అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సలావుద్దీన్ కుమారులు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈయన రాజకీయ జీవితం కూడా కార్పొరేటర్‌గా పోటీ చేయడం ద్వారానే మొదలైంది. 1986లో మోండామార్కెట్ నుంచి జనతాదళ్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1994, 1999, 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
పద్మారావు గౌడ్.. ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. 2002లో మోండా మార్కెట్ నుంచి కార్పోరేటర్‌గా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 2004, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచి రాజకీయాలలో రాణిస్తున్నారు.
డాక్టర్ కె. లక్ష్మణ్.. రాష్ట్ర బీజేపీ అగ్రనేతల్లో లక్ష్మణ్ ఒకరు. ఈయన రాజకీయ జీవితం కూడా కార్పొరేటర్ నుంచే ప్రారంభమైంది. 1986లో జవహర్‌నగర్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.
రేణుకాచౌదరి.. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఈమె రాజకీయ ప్రస్థానం కూడా 1986లో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గా గెలవడంతోనే ప్రారంభమైంది.
ముఖేశ్‌గౌడ్.. కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈయన నగర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూడా కార్పొరేటర్ స్థాయి నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.
వీరేకాక.. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్ ఎమ్మెల్యే), ముంతాజ్‌ఖాన్ (చార్మినార్ ఎమ్మెల్యే), అహ్మద్‌బలాల(మలక్‌పేట ఎమ్మెల్యే), సాయన్న(కంటోన్మెంట్ ఎమ్మెల్యే) లు కూడా కార్పోరేటర్ స్థాయి నుండి మొదలై ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే.. తీగల కృష్ణారెడ్డి, సయ్యద్ సజ్జాద్, పి.రామస్వామి, కృష్ణాయాదవ్ లు కూడా బల్దియా పోరుతోనే తమ రాజకీయ జీవితాలను ఆరంభించారు.