Delhi Elections : 'త్రిముఖ పోటీ'లో గెలిచేది ఎవరు.? ఓడేది ఎవరు.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
By Medi Samrat Published on 24 Jan 2025 10:59 AM ISTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగగా.. ఈసారి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏ పార్టీకి ఎన్నికల పోరు అంత సులువు కాదు. ఎన్నికల ప్రచారంలోనూ దీని ప్రతిబింబం కనిపిస్తోంది. ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి.
అప్పుడు రెండు పార్టీలే..
2008 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు నడిచింది. మొదట బీజేపీ ఒక ఎన్నికల్లో గెలుపొందగా, ఆ తర్వాత వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల దృశ్యం మారిపోయింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది.
తొలి ఎన్నికల్లోనే ఆప్ ఢిల్లీ ఎన్నికలను ముక్కోణపు పోరు దిశగా మార్చింది. ఆ పార్టీకి మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యి 49 రోజుల తర్వాత రాజీనామా చేశారు.
ఆ తర్వాత 2015 ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకుని ఆప్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సున్నాకి, బీజేపీకి మూడు స్థానాలు వచ్చాయి. 2020లో కూడా ఆ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నిస్తున్నా.. గట్టి సవాళ్లను ఎదుర్కొంటుంది. అదే సమయంలో 1998 నుండి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ తిరిగి పుంజుకోవడానికి ఎన్నికల పోరులోకి దిగింది. ఢిల్లీలో తన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందడంలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పదవీకాలంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచడంతో పాటు ఆప్ అవినీతిపై నాయకులు దృష్టి సారిస్తున్నారు.
కేజ్రీవాల్ క్రేజ్ ఆప్‌కు బలం..
ఈ ఎన్నికలు ఆప్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాలుష్య సమస్య, యమునా నదిలో అపరిశుభ్రత, చెత్తాచెదారం, పరిశుభ్రత, శిథిలావస్థలో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్య మొదలైన వాటిపై ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఇది ఎంత మేర ఆప్‌కు నష్టం కలిగిస్తుందో చూడాలి.
ఇప్పటికీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఇక్కడి ప్రజల్లో, ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో మంచి పట్టు ఉంది. ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యేలపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేశారు. 20 మంది కొత్త ముఖాలను ముందుకు తీసుకొచ్చి ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. దీనితో పాటు మహిళలకు నెలకు రూ.2,100 ఇవ్వడంతోపాటు వివిధ వర్గాలకు కొత్త ప్రజాకర్షక ప్రకటనలు చేస్తున్నారు.
బీజేపీ లెక్కలు వేరు..
ఆప్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, ఢిల్లీ సమస్యల కారణంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం వంటి అవకాశాలను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు ఎన్నికల వేదికపై నుంచి ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతున్నారు.
ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే కలను ఢిల్లీ ప్రజలకు చూపుతూనే.. సమస్యలకు ఆప్ నేతలను బాధ్యులను ప్రధాని చేశారు. ఆప్‌ని ఢిల్లీకి విపత్తు అని పిలవడం ద్వారా ఓటర్లను ఆప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా చేస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా నేతలు లెక్కలు వేస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో ప్రజాకర్షక వాగ్దానాలకు ఎగనామం పెట్టిన బీజేపీ.. తమ రెండు మ్యానిఫెస్టోల్లో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ప్రకటించడంతోపాటు వృద్ధులు, యువత, ఆటోడ్రైవర్లకు ప్రకటనలు చేస్తూ వారిని కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా చాలా మంది పాత నాయకుల టిక్కెట్లను కూడా రద్దు చేసింది.
కాంగ్రెస్, ఆప్‌లను వీడి బీజేపీలో చేరిన పలువురు నేతలు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో పలుచోట్ల కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిజ్వాసన్, మెహ్రౌలీ, తుగ్లకాబాద్, కరోల్ బాగ్, బాబర్‌పూర్ సహా అనేక స్థానాల్లో అసంతృప్త కార్యకర్తలను ఏకం చేసి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం పార్టీకి పెద్ద సవాలుగా మారింది.
బూత్ లెవల్ కార్యకర్తలతో ప్రధాని సంభాషించడంతో పరిస్థితి చక్కబడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీతో పాటు ఆప్ కూడా సొంత ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. అందుకే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నరేలా, హరినగర్‌లలో ఆప్ అభ్యర్ధులను మార్చుకోవాల్సి వచ్చింది. టికెట్ రాని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. వీరి వల్ల కూడా పార్టీ అభ్యర్ధులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. హరినగర్, నరేలా, జనక్‌పురి, పాలెం, లక్ష్మీ నగర్, కస్తూర్బా నగర్, కిరారి సహా పలు స్థానాల్లో ఆత్మీయుల నుంచి హాని జరిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పరిస్థితి వేరు..
ఇక ఆప్, బీజేపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది. కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి రాజకీయంగా ప్రతిష్టను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. న్యూఢిల్లీ, కల్కాజీ, జంగ్‌పురా, బద్లీ, కస్తూర్బా నగర్, ఓఖ్లా, మాల్వియా నగర్, ఉత్తమ్ నగర్ సహా పలు స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ రెండు పార్టీలకు గట్టి సవాలు విసిరింది. మహిళలకు నెలకు రూ.2,500 సహా సమాజంలోని వివిధ వర్గాల కోసం కాంగ్రెస్ అనేక ప్రకటనలు చేసింది. ప్రజాకర్షక వాగ్దానాలతో అధికారంలోకి రావాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
ఆ స్థానంపైనే అందరి కన్ను..
ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి మూడుసార్లు గెలుపొందారు. బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మను రంగంలోకి దించగా.. మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో ఓటరు జాబితా విషయమై వివాదం నెలకొంది.
ముఖ్యమంత్రి నెగ్గేనా..
మరో నియోజకవర్గం కల్కాజీలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అతీషిని అడ్డుకునేందుకు బీజేపీ మాజీ ఎంపీ రమేశ్ బిధూరిని, కాంగ్రెస్ పార్టీ అల్కా లాంబాను రంగంలోకి దింపింది. వివాదాస్పద ప్రకటనలు, ఇతర కారణాలతో ఈ సీటు కూడా చర్చనీయాంశమైంది.
రాజకీయ పార్టీల ప్రచారం, ప్రజాకర్షక వాగ్దానాలు, ఆరోపణల నేపథ్యంలో.. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది ఇంకా బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరు. వారి మౌనం అభ్యర్థుల గుండె చప్పుడును పెంచుతోంది. ఆ మౌనం ఓటుగా మారి ఎవరిని గద్దే మీద కూర్చోబెడుతుందో వేచి చూడాలి మరి.