కొడుకునైన విడిచిపెట్టన‌ని.. మల్లారెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు..?

Dasoju Sravan Fires On CM KCR. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జాకోరులుగా మారి.. కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను

By Medi Samrat  Published on  29 Aug 2021 1:17 PM GMT
కొడుకునైన విడిచిపెట్టన‌ని.. మల్లారెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు..?

టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జాకోరులుగా మారి.. కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను మింగేస్తున్నార‌ని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మల్లారెడ్డిపై రేవంత్ ఆధారాలతో ఆరోపణలు చేశారని.. మల్లారెడ్డి ఆరోపణలను ఎదుర్కోడానికి తొడలు, జబ్బలు కొట్టుకుంటూ మాట్లాడి.. ఇప్పుడు నేను అమాయకుణ్ణి అని అంటున్నారు.. సిగ్గుచేటని మండిప‌డ్డారు. మంత్రిపై వ‌స్తున్న‌ ఆరోప‌ణ‌ల విష‌య‌మై సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారని.. మల్లారెడ్డితో కుమ్మక్కైనారా..? అని ప్ర‌శ్నించారు.

అవినీతికి పాల్పడితే కొడుకునైన విడిచిపెట్టన‌న్న సీఎం కేసీఆర్‌.. మరి మల్లారెడ్డిని ఎందుకు వదిలేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీల భరతం పడతామ‌ని హెచ్చ‌రించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారని.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా..? అని ప్ర‌శ్నించారు. శామీర్ పేట్ లో సీఎంఆర్‌ హాస్పిటల్ పేరుతో మంత్రి ప్రజల రక్తం తాగుతున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ ఎట్లా వస్తదని.. రిజిస్ట్రేషన్ శాఖ కూడా సర్కార్ భూమి అని రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు.

తప్పుడు డాకుమెంట్స్ తో బీహెచ్ఈఎల్‌ భూములు నావే అని నమ్మించే ప్రయత్నం చేశార‌ని.. మల్లారెడ్డి ఏమైనా కేసీఆర్ అల్లుడా.. లేక తెలంగాణ అల్లుడా.. అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. న్యాక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ను బ్లాక్ లిస్ట్ లో పెడితే.. కేసీఆర్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చార‌ని ఫైర్ అయ్యారు. గుండ్ల పోచంపల్లిలోని హెచ్ఎండీఏ లేఔట్ లో వున్న పార్క్ నుండి మల్లారెడ్డి హాస్పిటల్ కు రోడ్ వేసుకున్నార‌ని.. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు మల్లారెడ్డి కోసమా..? అని ప్ర‌శ్నించారు.

ఉమ్మడి ఏపీలో ఆరుగురు మంత్రులపై ఆరోపణలు వస్తే.. అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని.. కేంద్రమంత్రులను కూడా వదల్లేదని గుర్తుచేశారు. 24గంటల కరెంట్ లో విచ్చలవిడిగా అవినీతి జ‌రిగింద‌ని.. మియాపూర్ ల్యాండ్, ఇసుక మాఫియా, నయిం , ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీ, కేసీఆర్ కిట్లు, మందుల కొనుగోళ్లలో దందా.. ఇలా సీఎం కేసీఆర్, మంత్రుల అవినీతిపై ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామ‌ని అన్నారు.


Next Story