తెలంగాణ రాష్ట్రంలోని రైతు సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. 'ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది అని రాహుల్ ట్వీట్ చేశారు.
రాహుల్ ట్వీట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన శ్రీ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.