మునుగోడులో కమ్యూనిస్టులు కీలకం కానున్నారా..?
Communists to play key role in Munugode by Election.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2022 10:05 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో సంవత్సరంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పాలని అన్ని పార్టీలు బావిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలించేందుకు అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి పార్టీలు. మరీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు..? ఇప్పటి వరకు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధించాయి అన్నది ఓ సారి చూద్దాం.
1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఇప్పటివరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సీపీఐ, ఒక సారి టీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్, సీపీఐ పార్టీలే ప్రధానంగా పోటీ పడినట్లుగా కనిపిస్తోంది.
వాస్తవానికి నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి అక్కడ కాంగ్రెస్ వరుస విజయాలతో దూసుకుపోయింది. అయితే కాంగ్రెస్ విజయాలకు సీపీఐ అడ్డుకట్ట వేసింది. ఉజ్జిని నారాయణ రావును 1985లో సీపీఐ తమ అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా మూడు సార్లు ఆయనే విజయం సాధించారు. కానీ.. 1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి విజయం సాధించగా.. 2009లో సీపీఐ పార్టీ తరపున పోటీ చేసిన ఉజ్జిని యాదగిరి రావు గెలిచి మునుగోడు గడ్డపై మరోసారి తమకు తిరుగులేదని నిరూపించారు కమ్యూనిస్టులు.
ఇక..రాష్ట్ర విభజన వరకు పరిస్థితులు ఎలా విభజన తరువాత అక్కడ రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ తొలి సారి మునుగోడులో జెండా ఎగురవేసింది. దీంతో అక్కడ కారు పార్టీకి ఆశలు చిగురించాయి. అయితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి గెలుపొందాలని బావించిన టీఆర్ఎస్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది.. అదేమిటంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది.
ఏదీ ఏమైనప్పటికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 21న ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు అనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎటువైపు అడుగులు వేస్తారు..? అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారిని తమవైపుకు తిప్పుకునే పనిని అన్ని పార్టీలు ఇప్పటికే ప్రారంభినట్లు తెలుస్తోంది. మరీ వారు ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దుతు తెలుపుతారా..? అన్నది ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్థానికంగా ఉన్న గ్రామాల్లో ఇప్పటికి కమ్యూనిస్టులకు బలమైన క్యాడరే ఉంది. ఏడు మండలాల్లో సీపీఐ, సీపీఎంకు కలిపి సుమారు 15 మంది సర్పంచ్‌లు, 10 మంది వరకు ఎంపీటీసీ సభ్యులు, చౌటుప్పల్ పురపాలికలో సీపీఎం పార్టీకి కౌన్సిలర్లున్నాయి. మొత్తంగా ఈ రెండు పార్టీలకు కలిపి 25 వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఇప్పటి వరకు కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ప్రకటించలేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే సొంతంగా పోటీ చేయాలని, విజయం సాధించి నియోజకవర్గంలో తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా ప్రధాన పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునేందుకు సిద్దంగా లేవు. కమ్యూనిస్టులు ఎటువైపు నిలిస్తే అటు వైపు గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మరీ కమ్యూనిస్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.