జనసేనకు 24 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసిందా?
జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చ సాగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
By అంజి Published on 18 Dec 2023 3:47 AM GMTజనసేనకు 24 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసిందా?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జేఎస్పీ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌లు తరచూ సమావేశమవుతున్నారు. అయితే మంగళగిరి అయినా, హైదరాబాద్ అయినా చంద్రబాబు ఇంటికి వెళ్లేది పవన్ కళ్యాణ్. అయితే ఈ సారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్ర బాబు, జేఎస్పీ అధినేతతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చించినట్లు భావిస్తున్నారు.
కెమెరాకు పోజులిస్తూ నవ్వుతూ కనిపించిన బాబు, పవన్ ఇద్దరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు. టీడీపీ-జేఎస్పీ పొత్తుకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించినట్లు సమాచారం. వైజాగ్‌లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న యువగళం ముగింపు వేడుకకు టీడీపీ సన్నాహాలు చేయక ముందే ఈ సమావేశం జరుగుతోంది. డిసెంబరు 20వ తేదీన పవన్ ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలపై చర్చ సాగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ తొలుత 30 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు అభ్యర్థించగా, చంద్రబాబు నాయుడు ఆ ఆఫర్ ను 24 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు తగ్గించారని సమాచారం. జనసేన నుండి 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులలో, సుమారు 10-12 మందిని చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు జనసేన జెండాతో పోటీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబుతో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సింగపూర్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా కూడా పవన్ కళ్యాణ్‌తో పాటు ఉండటం చాలా మంది దృష్టిని ఆకర్షించింది