కాకినాడ జిల్లా అన్నవరం పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడాలన్నారు. రాష్ట్రాన్ని అరాచక పాలన నుంచి కాపాడుకునేందుకు అవసరమైతే పార్టీ కోసం ప్రాణత్యాగాలకైనా కేడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ వార్షికోత్సవ సమావేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చమని పేర్కొంటూ పొత్తులపై వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి పల్లకీ మోయడానికి సిద్ధంగా లేమని, బీజేపీతో పొత్తు ఉందా లేదా అన్న ఆందోళన అవసరం లేదని జనసేన నేతలు అన్నారు. వరుసగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు వస్తాయా అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని గత కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో అదే చర్చ మొదలైంది.