బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా.. కేసీఆర్‌ను కవిత, హరీశ్‌ ప్రభావితం చేయగలరా?

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.

By అంజి  Published on  21 Aug 2023 7:30 AM GMT
Kavitha, Harish Rao, KCR, BRS candidates, Telangana

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా.. కేసీఆర్‌ను కవిత, హరీశ్‌ ప్రభావితం చేయగలరా?

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ సాయంత్రం (ఆగస్టు 21వ తేదీ సోమవారం) ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బీఆర్‌ఎస్‌లో రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్టు వస్తుందో, ఎవరికి తిరస్కరిస్తారో సూచిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక 'లీక్ లిస్ట్'లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీకులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు బిఆర్‌ఎస్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అనేక మంది టిక్కెట్ ఆశించేవారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, టికెట్‌ ఆశించిన వారు దూసుకుపోతున్నారు.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుమార్తెతో.. తమకు టిక్కెట్లు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్‌ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీఆర్‌ఎస్ నేతలు సమావేశమవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన కుమారుడు హిమాన్షు అండర్‌గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్‌ కోసం కేసీఆర్‌ రెండో దఫా శనివారం రాత్రి అమెరికా వెళ్లారు. కేటీఆర్ ఎప్పుడు హైదరాబాద్ వస్తారనే దానిపై క్లారిటీ లేదు, అతను ఒక వారం పాటు విదేశాల్లో ఉండవచ్చని పార్టీలోని కొందరు చెప్పుకుంటున్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లు అందుబాటులో లేకపోవడంతో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించేవారు ఇప్పుడు కవిత నివాసం వైపు మొగ్గు చూపుతున్నారు. కవితను చేరుకోలేని వారు కేసీఆర్ మేనల్లుడు అయిన మంత్రి హరీశ్ రావును సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ను ప్రభావితం చేసే సత్తా కవిత, హరీశ్ లకు ఉందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కేటీఆర్ మాటను కేసీఆర్ కొంత వరకు వినవచ్చుగాని, కవిత లేదా హరీష్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని బిఆర్ఎస్ వర్గాలు సూచిస్తున్నాయి.

Next Story