తెలంగాణను ఎడారిగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 11:14 AM ISTతెలంగాణను ఎడారిగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోందని అన్నారు. కుంగిపోయిన బ్రిడ్జి పనులను పూర్తి చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై మాట్లాడిన కేటీఆర్.. ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనాన్ని వివరించడాని, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండకుండా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు.
తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై ఉన్న కోపాన్ని ప్రజల మీద చూపొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పారు. ఎండుతున్న పంటలకు తక్షణమే నీరు అందించి, రైతులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడొద్దంటూ హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తోందని కేటీఆర్ అన్నారు. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెడతామన్నారు. ప్రజా ధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా కూలిపోవాలని కాంగ్రెస్ ఎదురుచూస్తోందని ఆరోపించారు. చలో మేడిగడ్డ ద్వారా కాంగ్రెస్ కుతంత్రాన్ని బట్టబయలు చేస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయన్ని పండగలా చేశామని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దండగలా మార్చాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. పంజాబ్‌ను తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తోందన్నారు. మరమ్మత్తులు కూడా చేతగాని గుంపుమేస్త్రీని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుతాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.