ఆంధ్రప్రదేశ్‌పై కేసీఆర్ నజర్.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప్లాన్
BRS plan to Massive Public Meeting in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పటిష్ట నిర్మాణంపై
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2023 3:50 AM GMTదేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ ఏర్పాటు, విస్తరణ, సభ్యత్వ నమోదు వంటి అంశాలపై దృష్టి సారించారు.
ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పటిష్ట నిర్మాణంపై సమాలోచనలు చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్ సహా మరికొందరు నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్.. అదే సమయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు.
బుధవారం ప్రగతిభవన్‌లో తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విస్తరణ, పటిష్ట నిర్మాణంపై చర్చించారు. ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే సభా వేదిక, నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఏపీలో వెంటనే రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించాలని సూచించారు. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మాణాత్మక వైఖరితో ముందుకు వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని చంద్రశేఖర్‌ని కోరినట్లు తెలిసింది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం బీఆర్ఎస్ విస్తరించేలా చేయాలని, అందుకోసం పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.