ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చినదే: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 28 March 2024 4:00 PM ISTఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చినదే: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ రైతుబంధు కోసం ఏడువేల కోట్లు ఇస్తే.. అవి రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌లకు ఆ డబ్బు ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం వచ్చిన కరువు కాలం తెచ్చినది కాదనీ.. కాంగ్రెస్ తెచ్చిన కరువే అని కేటీఆర్ మండిపడ్డారు.
గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల పంటలు ఎండిపోకుండా సరిపడా సాగునీరు అందిచామని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం, కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీకి, హైదరాబాద్‌కి తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం సీఎం రేవంత్‌రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. అలాగే అన్నదాతలకు ఇస్తామన్న బోనస్, కైలు రైతులకు రైతుబంధు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.