తెలంగాణలో పవన్ మద్దతు కోరిన బీజేపీ.. టీడీపీ సంగతేంటీ?
తెలంగాణ బీజేపీ బుధవారం నాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మద్దతు కోరింది. ఈ అంశంపై చర్చించి 3 రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని పవన్ తెలిపారు.
By అంజి Published on 19 Oct 2023 3:51 AM GMTతెలంగాణలో పవన్ మద్దతు కోరిన బీజేపీ.. టీడీపీ సంగతేంటీ?
నవంబరు 30న జరగనున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 32 స్థానాలకు అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో ఇప్పటికే ఉన్న పొత్తును కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఈ జాబితాను ప్రకటించారు.
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం చర్చలు జరిపి ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకు టీడీపీ, జనసేనలు రెండూ తమ తమ సమన్వయ కమిటీలను నియమించుకున్నాయి. కానీ తెలంగాణలో జనసేన పార్టీ టీడీపీ లేదా బీజేపీతో పొత్తుపై తన వైఖరిని స్పష్టం చేయలేదు. త్వరలో అభ్యర్థులను ప్రకటించేందుకు స్వంత జాబితాతో బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ బుధవారం నాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ మద్దతు కోరింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లోని పవన్‌కల్యాణ్‌ను ఆయన నివాసంలో కలిశారు.
ఈ చర్యతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చని, ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. ఈ అంశంపై పార్టీలో చర్చించి మూడు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో పొత్తు లేకుండా పోటీ చేస్తామంటూ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ఆ పార్టీ గతంలోని వైఖరికి విరుద్ధంగా ఉంది.
కిషన్ రెడ్డి, లక్ష్మణ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో పోటీ చేయాల్సిన అసెంబ్లీ సెగ్మెంట్లపై గంటకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. బీజేపీ కేంద్ర నాయకత్వంతో కిషన్‌రెడ్డి భేటీ తర్వాతే ఈ భేటీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పుడు రెండు పార్టీలు పొత్తుకు అంగీకరిస్తే టీడీపీ భవితవ్యం ఏంటి? అది కూడా కూటమిలో చేరుతుందా లేక పోటీకి దూరంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి.