ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తులపై చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. దీన్ని బట్టి టీడీపీ జనసేన కలవబోతున్నాయనే వాదనలు తెరముందుకు వస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేన పార్టీతోనే పొత్తు ఉంటుందని.. మరో పార్టీ అవసరం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. జనసేనతో తప్ప ఇతర రాజకీయపార్టీలతో పొత్తులు ఉండే అవకాశం లేదని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీతోనే పొత్తు ఉంటుందని.. త్వరలోనే జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటాలు ప్రారంభిస్తాయని ఆయన వెల్లడించారు. పీఎంఏవై కింద కేంద్రం ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇస్తుంటే.. సీఎం జగన్‌పేరు పెట్టడం కరెక్ట్ కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జగన్ పేరు తొలగించాలని లేని పక్షంలో జనవరి 3వ తేదీన ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.