తెలంగాణలో ఆర్‌జీ ట్యాక్స్ వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 5:04 PM ISTతెలంగాణలో ఆర్‌జీ ట్యాక్స్ వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు కమలం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు చేశారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణలో ఎలాంటి మార్పు రాలేదని కిషన్‌రెడ్డి అన్నారు. కేవలం బీఆర్ఎస్ పోయింది.. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదన్నారు. పైగా తెలంగాణలో ఇప్పుడు ఆర్‌జీ ట్యాక్స్ (రాహుల్‌గాంధీ) విధిస్తున్నారని ఆరోపించారు. బిల్డర్లు మొదలుకొని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల వరకు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్ల రూపాయలు ఇచ్చి రావాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు.. ఎప్పట్నుంచో ఇలాగే వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలన ఉన్నంత వరకు ఎలాంటి మార్పులు రావని స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్‌కు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిపై అవగాహన ఏమాత్రం లేదని కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
గతంలో కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదని కిషన్‌రెడ్డి అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి తమ స్వార్థం కోసం వాడుకున్నారని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడూ తమ ఫామ్‌హౌజ్ గురించి మాత్రమే ఆలోచించారని ఆరోపించారు. ఇప్పుడు దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే తెలంగాణలో దిక్కులేదు అంటే.. రాహుల్‌గాంధీ వచ్చి వచ్చి కొత్తగా మరిన్ని హామీలిచ్చి వెళ్లిపోయారంటూ కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. పాలనలో మార్పు లేదనీ.. దోపిడీలో కూడా మార్పులేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.