బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు: బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 11:02 AM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు: బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు.. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు కూడా తమతో టచ్‌లో ఉన్నారనీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో బీజేపీ అస్సలు పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవన్నారు.
బీఆర్ఎస్‌తో తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకోదు అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మోదీ అవినీతికి పాల్పడిన పార్టీలతో పొత్తు పెట్టుకోరని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఎన్డీఏలో చేర్చుకోలేదని.. అలాంటిది ఇప్పుడెలా పొత్తు పెట్టుకుంటామన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎటుకాని పార్టీగా మిగిలిపోయిందన్నారు. ఆ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు పక్కదారులు చూసుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపైనా బండి సంజయ్ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. గొర్రెలు అంటూ అవినీతి గురించి మాట్లాడటమే తప్ప చర్యలేమీ తీసుకోవడం లేదని అన్నారు. ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముందు బీజేపీ నేతలు చూశారనీ.. సెంట్రల్ డ్యాం సెఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఇచ్చిందనీ చెప్పారు. ఇలాంటి సమయంలో క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు బండి సంజయ్. అవినీతికి పాల్పడ్డ సొమ్మును ఎలా రాబడతారని ప్రశ్నించారు.