తెరవెనక టీడీపీ, జనసేన పొత్తు.. బయటికి మాత్రం మరోలా..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి.

By అంజి  Published on  3 July 2023 10:56 AM GMT
APnews, TDP, Janasena, alliance, Pawan Kalyan

తెరవెనక టీడీపీ, జనసేన పొత్తు.. బయటికి మాత్రం మరోలా..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పొత్తు విషయమై క్లారిటీ రావడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ విషయాన్ని ఇరు పార్టీలు ఇప్పటి వరకు బహిరంగ పర్చలేదు. టీడీపీ వర్గాలు మాత్రం పొత్తు కుదిరిందని డోలు కొట్టి మరీ చెబుతున్నాయి. సింగిల్‌గా కాదు, మింగిల్‌గా వెళ్తామంటూ ధీమాగా చెబుతున్నారు. అయితే జనసేన శ్రేణులు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమ పవన్‌ బాబే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా తనను సీఎం చేయాలని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రంలోని నలుదిక్కులూ క్లీన్‌ స్వీప్‌ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

ఒక వేళ పొత్తు ఉంటే పవన్‌ అనుకున్నవన్నీ సాధ్యమవుతాయా? అంటే.. సమాధానం డౌట్‌గానే ఉంది. అందుకే పవన్‌ అసలు పొత్తు విషయం మాట్లాడకుండా.. వైసీపీని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీకి ముందు రాష్ట్రాన్ని పాలించి టీడీపీ సాధించని వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. టీడీపీ నేతల గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. ద్వారంపూడి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి.. ఇలా ఒక ఫ్లోలో రెడ్లను తిట్టడంతోనే సరిపెట్టుకుంటున్నారు పవన్. రెడ్లను తప్ప మరో కులానికి చెందిన వారిని పల్లెత్తు మాట కూడా పవన్‌ అనట్లేదంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదని అనుకోవడం, రెడ్లను టార్గెట్ చేయడం ఇవన్నీ కలిసి తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలకు అద్దం పడుతున్నాయి.

అటు మొన్నటి వరకు అన్నవరం నుంచి కత్తిపూడి మీదుగా కాకినాడ వరకు చేసిన పవన్‌ స్పీచ్‌లలో తన పార్టీని గెలిపించాలని, తనను ముఖ్యమంత్రిని చేయాలని, తనను ముఖ్యమంత్రిని చేస్తే అది చేస్తానని చెప్పి, ఇప్పుడు చాలా సింపుల్‌గా మాట మార్చేశారు. అసలు ఎక్కడెక్కడా పోటీ చేస్తారన్న విషయం కూడా చెప్పట్లేదు. పైగా తనను సీఎం చేయండి అని అంటున్నారు. పవన్‌ తన వారాహి యాత్రలో వైసీపీని తిట్టడం తప్ప మరో పని పెట్టుకోలేదు. ఒక వేళ పవన్‌ ఒంటరిగానే పోటీ చేసే ఛాన్స్‌ ఉంటే రెండు జిల్లాల్లో కనీసం ఒకరిద్దరూ అభ్యర్థుల పేర్లను ప్రకటించే వారు. మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడటం లేదు. వైసీపీని, రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీని గద్దె దించి టీడీపీని అధికారంలోకి తేవడం కోసం పవన్‌ ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇది గమనించే టీడీపీ జనాలు పొత్తు కుదిరిందని చెబుతూ ఉన్నారు. ఇంత హడావుడి చేస్తున్న పవన్‌.. రేపు పొత్తు పెట్టుకుంటే జనసేన సైనికుల పరిస్థితి ఎలా ఉంటుందో మరీ?

Next Story