హుజురాబాద్ ఉప ఎన్నిక నేఫథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడకున్నా నేతల హడావుడి మొదలైంది. నాయకుల మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేఫథ్యంలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని అన్నారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నామని.. అయితే అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి కలిశామన్నారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తా అన్నారని.. ఆగస్టు 9వ తేదీన పాదయాత్ర మొదలవుతుందని.. పాదయాత్రకు కూడా అమిత్ షాను ఆహ్వానించామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్న ఆయన.. ఎన్నికలకు టీఆర్ఎస్ భయపడుతోందని అన్నారు. టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ డబ్బులు ఎంత పంచినా.. ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ ను గెలిపిద్దాం అని అనుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.