మహారాష్ట్ర ఎన్నిక‌లు.. 1995 తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నిక‌ల‌లో రాష్ట్ర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు.

By Kalasani Durgapraveen  Published on  21 Nov 2024 8:15 AM GMT
మహారాష్ట్ర ఎన్నిక‌లు.. 1995 తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నిక‌ల‌లో రాష్ట్ర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 65.02 శాతం ఓటింగ్ జరిగింది. ఈ గణాంకాలు బుధవారం రాత్రి 11.45 గంటల వరకు మాత్ర‌మే వెల్ల‌డైన‌వి. 1995 తర్వాత రాష్ట్ర ఓటర్లలో ఇంత ఉత్సాహం కనిపించడం ఇది రెండోసారి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో 71.7 శాతం ఓటింగ్ నమోదైంది.

దేశంలో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 61.39 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే.. 61.4 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ విజయాలపై ధీమాగా ఉన్నారు.

మహారాష్ట్రలోని చాలా మంది పెద్ద వ్యక్తులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేయడం పట్ల పలువురు ప్రశంసలు కూడా కురిపించారు.

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పంచుకున్న సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి 11:45 గంటల వరకు ఓటింగ్ శాతం డేటా రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కొల్హాపూర్‌లో అత్యధిక ఓటింగ్ జరిగినట్లు వెల్లడించింది. ఇక్కడ దాదాపు 76.25 శాతం మంది తమ ఓటును వినియోగించుకున్నారు. కొల్హాపూర్‌లో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా, గడ్చిరోలిలో 73.68 శాతం, జల్నాలో 72.30 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్న ముంబై సిటీ జిల్లాలో అత్యల్పంగా 52.07 శాతం పోలింగ్ నమోదైంది.

మరోవైపు, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న దృష్ట్యా పట్టణ ఉదాసీనత తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇందుకోసం.. ఎలక్షన్ కమీషన్, 'ఎత్తైన భవనాలు, రెసిడెన్షియల్ సొసైటీలలో 1,185 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.' సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్న ఓటర్లకు అవసరమైన బెంచీలు, వీల్ చైర్లు వంటి సౌకర్యాలు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనేక అవగాహన, ప్రజాఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం పట్టణ, యువ ఓటర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడం.. అయినా త‌క్కువ శాతం పోలింగ్ నమోదైంది.

Next Story