పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకుల మాటల తూటాలు
AP Ministers Satires On Pawan Kalyan. పవన్ కల్యాణ్ గుడివాడలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మాటల
By Medi Samrat Published on 29 Dec 2020 2:23 PM GMTపవన్ కల్యాణ్ గుడివాడలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 'సినిమాల్లోనే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అని.. బయట మాత్రం పకీర్ సాబ్' అంటూ విమర్శించారు. పవన్ పర్యటన సినిమా ప్రమోషన్‌లా ఉందని అన్నారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పవన్ కల్యాణ్ ను విమర్శించారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగులు, షూటింగులు కాదని అన్నారు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని వ్యాఖ్యానించారు. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి... ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటే మా నాయకుడిలా పాదయాత్ర చేయండి అంటూ పవన్ కల్యాణ్ కు సూచించారు. 14 నెలల పాటు పాదయాత్ర చేయడం అంటే సినిమా చేసినట్టు కాదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ పార్టీకి మద్దతిస్తారో పవన్ కల్యాణ్ కే తెలియదని అన్నారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయారని విమర్శించారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ ఎవరు? అని ప్రశ్నించారు. మెడపై మట్టి నలుపుకుంటూ ఉండే ఆయనేనా పవన్ కల్యాణ్ అంటే? అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడతలు కొట్టిన వ్యక్తి పవన్ అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ దిట్ట అని.. 2014లో రైతులు పంటను నష్టపోతే అప్పటి మీ జాయింట్ ప్రభుత్వమైన టీడీపీ-బీజేపీ ప్రభుత్వంతో ఎంత ఇప్పించారని ప్రశ్నించారు. అప్పుడు మీరు, మీ పార్టనర్ ఇచ్చిన దానికంటే తాము ఒక్క రూపాయి ఎక్కువే ఇస్తున్నామని అన్నారు. పవన్ ను నమ్మొద్దని జనాలను కోరుతున్నానని, ఆయనను నమ్మితే కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదినట్టేనని చెప్పారు.