ఆ విలేఖరి హత్యకేసులో లక్ష ఫోన్ కాల్స్ పరిశీలించిన పోలీసులు.. ఇంకా దిమ్మతిరిగే నిజాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 4:29 PM ISTప్రముఖ దినపత్రిక విలేఖరి కాతా సత్యనారాయణ హత్యకేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. సుమారు సత్యనారాయణకు సంబంధించిన లక్ష ఫోన్ కాల్స్‌ను పోలీసులు విశ్లేషించారు. ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ, మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని మృతుడు సత్యనారాయణ బెదిరించి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన గౌరీ రూ.2 లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకుని పథకం ప్రకారం హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ చెప్పారు.
ఎస్.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్.అన్నవరానికి చెందిన మడగల దొరబాబు విలేకరి సత్యనారాయణను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు లక్షకుపైగా ఫోన్ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలించామని, సాంకేతిక నిపుణుల సహాయంతో అసలు నేరస్తులను పట్టుకున్నట్టు తెలిపారు. హత్యకు నేరస్తులు వినియోగించిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో డీఎస్పీలు రామకృష్ణ, అరిటాకుల శ్రీనివాసరావు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
సత్యనారాయణ జర్నలిస్టు ముసుగులో స్థానిక తెలుగు దేశం పార్టి నేతలతో కలసి సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు. విలేఖరి సత్యనారాయణ తేటగుంటలో 2009లో 64.5 సెంట్లు, 2011లో 91 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్లు, 2013లో 79 సెంట్లు భూమి కొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎస్.అన్నవరంలో ఎకరా 20 సెంట్లు, తుని వీరవరపేటలో 267 గజాలు ఇంటి స్థలం, 2015లో ఎస్.అన్నవరంలో 110 గజాల ఇంటి స్థలం, 2016లో టి.వెంకటాపురంలో 182 గజాలు ఇంటిస్థలం, తేటగుంటలో 42 సెంట్ల భూమి, 2019లో టి.వెంకటాపురంలో 25 సెంట్ల భూమి ఇలా భూములు సంపాదించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇవే కాకుండా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారని కథనం.