కొత్తగా మరో కేసు.. పోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Sept 2020 5:28 PM ISTసినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌లో నూతన్ నాయుడుపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కాగా తాజాగా నూతన నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో.. పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో అతడిని విచారించనున్నారు.
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నూతన్ నాయుడును లోతుగా విచారించేందుకు అనుమతినివ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు. దాంతో శని, ఆదివారాల్లో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి నూతన్ నాయుడిని పెందుర్తి తీసుకువచ్చి విచారిస్తున్నారు.
ఇదిలావుంటే.. కొద్ది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్య మధుప్రియ, ఇంటి సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నూతన్ నాయుడు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 6వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా.. నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు దండుకొని.. చివరికి మోసం చేశారని బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తికి ఎస్‌బీఐలో రీజియన్ డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానని రూ.12కోట్లు.. నూకరాజు అనే వ్యక్తి వద్ద నుండి రూ. 5లక్షలు వసూలు చేశాడని.. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో వారు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.