ఇలాంటి సమయాల్లో కూడా డబ్బులు కొట్టేస్తారా..?

By అంజి  Published on  4 April 2020 3:55 PM GMT
ఇలాంటి సమయాల్లో కూడా డబ్బులు కొట్టేస్తారా..?

మిగిలిన వాళ్లు ఎలా పోయినా మాకేమి.. మా సంపాదన మాది అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు.. పేద వాళ్ళను ఆదుకోవాలని సహాయం చేయాలని పలువురు కోరుతూ ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి.. డబ్బులు తమకు ఇస్తే కష్టాల్లో ఉన్న వాళ్లకు తప్పకుండా ఆ డబ్బును చేరవేస్తామని అంటున్నారు. కానీ కొందరు కేటుగాళ్ళు మాత్రం మొత్తం డబ్బుకే ఎసరు పెట్టాలని అనుకుంటూ ఉన్నారు. ఫేక్ యూపీఐ ఐడీలు తయారు చేసి డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.

వీళ్ళు కొట్టేయాలని అనుకుంది ఎవరి డబ్బులో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ‘పీఎం కేర్స్ ఫండ్’ విరాళాన్ని అప్పనంగా కొట్టేయాలని అనుకున్నారు.. కానీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మోసాలను గుర్తించారు.

పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కూపీ లాగుతున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన పేరును పోలీసులు వెల్లడించలేదు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సి.ఇ.ఆర్.టి.-ఇన్) ఇప్పటికే చాలా ఫేక్ యూపీఐ ఐడీలను ట్రాక్ చేశారు. అవన్నీ చాలా వరకూ పీఎం కేర్స్ ఫండ్ కు దగ్గరగా ఉన్నాయి.

కేటుగాళ్లు ఫేక్ ఐడీలు.. నమ్మకండి..

భారత ప్రభుత్వం క్రియేట్ చేసిన pmcares@sbi యూపీఐ ఐడీకి దగ్గరగా ఉండేలా బోగస్ ఐడీలను సృష్టించారు. pmcare@sbi pmcares@pnb,pmcares@hdfcbank, pmcare@yesbank, pmcare@ybl, pmcare@upi, pmcares@icici వంటి బోగస్ ఐడీలు చలామణీ అవుతున్నాయి.

pmcare@sbi యూపీఐ ఐడీకి చాలా దగ్గరగా ఉన్న యూపీఐ ఐడీ ఇప్పటికీ చలామణీలో ఉందని ఏసీపీ కెవిఎం ప్రసాద్ తెలిపారు. ఒరిజినల్ పీఎం కేర్స్ ఫండ్ యుపీఐ ఐడీ 'pmcares@sbi'.. దీని అకౌంట్ నేమ్ PMCARES. మిగిలిన సమాచారం కోసం ప్రభుత్వ అఫీషియల్ వెబ్ సైట్ అయిన pmindia.gov.in సంప్రదించాలని ప్రసాద్ తెలిపారు. కోవిద్-19 వైరస్ విపరీతంగా ప్రబలుతున్న సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ప్రధానమంత్రి ఈ యూపీఐ ఐడీని క్రియేట్ చేశారు. సహాయం చేయాలని అనుకున్న ప్రజలు.. ఈ యూపీఐ ఐడీలను వెతికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్న వాళ్లకు ఫేక్ యూపీఐ ఐడీలు పెద్ద సమస్యగా మారాయి. చాలా మంది కేటుగాళ్లు ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి డబ్బులను తమ అకౌంట్స్ లోకి తరలించాలని చూస్తున్నారు.

పోలీసులు సుమోటోగా రిజిస్టర్ చేసి సెక్షన్ 66-C & D ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం, ఐపీసీ సెక్షన్ 420, 419 కింద కేసులు నమోదు చేశారు. అకౌంట్ హోల్డర్ కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు.

పీఎం కేర్స్ ఫండ్‌ యూపీఐని కాపీకొట్టి కేవలం ఒకే అక్షరం తేడాతో నకిలీ యూపీఐ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు కొట్టేయాలని భావిస్తున్న వారి నుండి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సహాయం చేయాలి అనుకుంటున్నప్పుడు సరైన అకౌంట్ కే మన డబ్బులు వెళుతున్నాయా లేదా అన్నది కూడా గమనించాలి.. లేదంటే మనం మోసపోవడం జరుగుతుంది. చేయాలనుకున్న సహాయం కూడా చేయలేకపోయామని బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా కొందరు ఈ ఫేక్ ఐడీల ద్వారా డబ్బులు కొట్టేయాలని అనుకుంటూ ఉండడం నిజంగా బాధాకరమైన విషయమే..! అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.

Next Story