Fact Check : నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లోపల అంత విలాసవంతంగా ఉంటుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 11:36 AM GMT
Fact Check : నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లోపల అంత విలాసవంతంగా ఉంటుందా..?

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీతూ పత్వానీ ఓ విలాసవంతమైన విమానానికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన విమానం అంటూ పోస్టు చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో సెటైరికల్ గా నరేంద్ర మోదీ మీద విమర్శలు చేశారు.

Pm1

'కేవలం టీ అమ్మే బ్యాగ్రౌండ్ తో వచ్చిన మోదీ.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు.. ఆయన ప్రయాణించే విమానం లోపల ఎంత గొప్పగా ఉందో చూడండి' అంటూ పోస్టు పెట్టాడు. భారత ప్రధాని అన్ని లగ్జరీలను ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లోపల ఇంత విలాసవంతంగా ఉంటుంది అన్న ఈ పోస్టు 'పచ్చి అబద్ధం'

ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలు బోయింగ్ 787 విమానం లోపల భాగానికి చెందినవని.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసారంటూ.. అలాగే భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కోసం బోయింగ్ 777ను వాడుతున్నారని చెబుతూ కొన్ని రిజల్ట్స్ కనిపించాయి.

మరింత లోతుగా ఈ ఫోటోల గురించి సెర్చ్ చేయగా హాంగ్ కాంగ్ కు చెందిన డీర్ జెట్ కు చెందినవని స్పష్టమైంది. బిజినెస్ జెట్ లీజింగ్ సంస్థ అయిన డీర్ జెట్ పలువురికి ప్రయివేట్ జెట్ లను, హెలీకాఫ్టర్లను, ప్రయివేట్ లగ్జరీ పడవలను లీజ్ కు ఇస్తూ వస్తుంటుంది. ప్రైవేట్ బోయింగ్ 787 విమానానికి సంబంధించిన విజువల్స్ ను యూట్యూబ్ లో చూడొచ్చు..! వైరల్ పోస్టులో ఉన్న ఇంటీరియర్ ఫోటోలు.. యూట్యూబ్ లో ఉన్న ఫోటోలు దాదాపుగా ఒకటిగానే అనిపిస్తోంది.

deerjet వెబ్ సైట్ లోకి వెళ్లగా వైరల్ అవుతున్న ఫోటోనే కనిపించింది. డ్రీమ్ లైనర్ 787 లోపల ఉన్న ఫోటోలను కూడా చూడొచ్చు.

రెండు కస్టమ్ మేడ్ B777 విమానాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల కోసం భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 2020 నాటికి ఎయిర్ ఇండియాకు బోయింగ్ డెలివరీ చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ నేత పోస్టు చేసిన ఫోటోల్లో ఉన్నది భారత ప్రభుత్వం ఆర్డర్ చేసిన విమానం లోపలిది కాదు. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ విమానాల బాగోగులు చూసుకోనుంది. ఈ విమానాలను ఎయిర్ ఫోర్స్ పైలట్లు మాత్రమే నడుపుతారు. ఈ B777 విమానాల్లో అత్యాధునికమైన డిఫెన్స్ సిస్టం కూడా ఉండనుంది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా వైరల్ అవుతున్న పోస్టు అబద్ధమని తెలుస్తూ పోస్టు పెట్టింది.



భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎంతో విలాసవంతంగా తయారుచేసిన విమానం లోపలి భాగం అంటూ కాంగ్రెస్ నేత పెట్టిన పోస్టు 'అబద్ధం'.

Next Story