Fact Check : రామ మందిరం నిర్మాణం సందర్భంగా రాముడి విగ్రహానికి బ్రిటన్ ప్రధాని సతీసమేతంగా అభిషేకం చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 10:55 AM GMT
Fact Check : రామ మందిరం నిర్మాణం సందర్భంగా రాముడి విగ్రహానికి బ్రిటన్ ప్రధాని సతీసమేతంగా అభిషేకం చేశారా..?

ఆగష్టు 5, 2020న భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరం భూమి పూజను నిర్వహించారు. ఎంతో మంది హిందువుల ఆకాంక్ష నెరవేరడంతో చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ అద్భుత ఘట్టంపై తమదైన శైలిలో స్పందించారు. ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు సంబంధించిన ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రామ మందిరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తమ భార్యతో కలిసి శ్రీరాముడి విగ్రహానికి అభిషేకం చేసారంటూ ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

B1

ఈ ఫోటోకు సంబంధించిన నిజానిజాలేంటో తెలుసుకోవాలంటూ వాట్సప్ లో న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ వచ్చింది.

నిజ నిర్ధారణ:

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శ్రీ రాముడి విగ్రహానికి అభిషేకం చేశారన్నది అబద్ధం.

ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా న్యూస్ మీటర్ కు ఫేస్బుక్ పోస్టు లభించింది. Conservatives అనే ఫేస్ బుక్ పేజీలో డిసెంబర్ 9, 2019న ఈ ఫోటోను అప్లోడ్ చేశారు. బోరిస్ జాన్సన్ నార్త్-వెస్ట్ లండన్ లోని నీస్డెన్ లో ఉన్న హిందూ ఆలయానికి ప్రీతీ పటేల్ తో కలిసి వెళ్లారు అని చెప్పుకొచ్చారు.

‘Boris Johnson visits the Hindu temple in Neasden’ (హిందూ ఆలయాన్ని సందర్శించిన బోరిస్ జాన్సన్) అనే కీవర్డ్స్ ను ఉపయోగించి వెతకగా ఆయన ఆలయాన్ని సందర్శించిన పలు రిజల్ట్స్ లభించాయి. డిసెంబర్ 2019లో ఆయన ఆలయాన్ని సందర్శించారు. బ్రిటన్ లో ఎన్నికల కంటే ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. బోరిస్ జాన్సన్, ఎంపీ హోమ్ సెక్రెటరీ అయిన ప్రీతీ పటేల్ తో కలిసి నీస్డెన్ లో ఉన్న స్వామినారాయణ ఆలయానికి డిసెంబర్ 8, 2019న వెళ్లారు. ప్రముఖ్ స్వామిజీ 98వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

నీస్డెన్ టెంపుల్ నిర్వాహకులు కూడా దీనిపై ట్వీట్ చేశారు.

బ్రిటన్ ప్రధాని ఆలయాన్ని సందర్శించడాన్ని రాజకీయ కోణంలో చూస్తూ అక్కడి మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. హిందువుల ఓట్ల కోసమే బోరిస్ జాన్సన్ అక్కడి వెళ్లారని చెప్పుకొచ్చారు.

వైరల్ అవుతున్న ఫొటోలో ఆయనతో పాటూ ఉన్నది ఆయన భార్య కాదు.. హోమ్ సెక్రెటరీ ప్రీతీ పటేల్. వారు అభిషేకం చేస్తోంది రాముడి విగ్రహానికి కాదు.. భగవాన్ స్వామి నారాయణ యవ్వన దశలో ఉన్న శ్రీ నీలకంఠ వర్ని విగ్రహానికి..! బోరిస్ జాన్సన్ తన భర్త కేరీ సైమండ్స్ తో కలిసి విగ్రహానికి అభిషేకం చేస్తున్న ఫోటో వెబ్ సైట్ లో లభించింది. ఆమె పింక్ రంగు చీరలో మెరిసిపోతూ కనిపించారు.

B2

లండన్ లోని శ్రీ స్వామి నారాయణ్ మందిరాన్ని నిర్మించిన 'ప్రముఖ్ స్వామిజీ మహారాజ్' 98వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 7, 2019న హాజరయ్యారు. ఆయన అక్కడి వారందరికీ హిందూ సంప్రదాయంలోనే శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత శ్రీ నీలకంఠ వర్ని విగ్రహానికి అభిషేకం కూడా నిర్వహించారు. భగవాన్ స్వామినారాయణ్ కు పూలతో పూజలు చేశారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శ్రీ రాముడి విగ్రహానికి అభిషేకం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అబద్ధం.

Next Story