దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని సమీక్ష.. కీలక వ్యాఖ్యలు
By తోట వంశీ కుమార్ Published on 11 July 2020 6:06 PM ISTభారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, నీతీఅయోగ్ సభ్యులు, క్యాబినేట్ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోగ్యం, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక క్రమశిక్షణ, కోవిడ్-19 పై అవగాహన ముఖ్యమని, ఈ మూడింటితో ఈ వైరస్ ని దూరం చేయవచ్ఛునన్నారు. కరోనా కట్టడికి కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేశరాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తి పరిస్థితిని అరికట్టడంలో కేంద్రం, రాష్ట్ర, స్థానిక అధికారుల అవిరళ కృషిని ప్రధాని ప్రశంసించారు. ఎన్‌సిఆర్ అంటే జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టిన విధానాన్నే , ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబించాలన్నారు. అహమ్మదాబాద్ లో ‘ ధన్వంతరి రథ్’ పేరిట అమలు చేస్తున్న గృహ సంబంధ ‘సర్వేలెన్స్’ మంచి ఫలితాలనిస్తోందని మోదీ చెప్పారు. ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేయాలన్నారు. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు మోదీ ఆదేశించారు.
కాగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో 27,114 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 22,123 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,83,407 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది కోలుకున్నారు.