సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తి.. ప్రధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 7:58 AM GMT
సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తి.. ప్రధాని మోదీ

కార్గిల్‌ యుద్దంలో భారత సైనికులు చూపిన త్యాగం ఎప్పటికీ స్పూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

21 ఏళ్లుగా మనం ఏటా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామనీ.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. భారత సైన్యం ధైర్యంగా తిప్పికొట్టిందని మెచ్చుకున్నారు. ఆ యుద్ధంలో సైనికులు చూపిన త్యాగం ఎప్పటికీ స్పూర్తిదాయకమని అన్నారు. సైనికుల శౌర్యం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందన్నారు. 'దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్యసాహసాలకు వందనం. 21 ఏళ్ల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్ యుద్ధంలో గెలిచింది. భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోంది. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు పాక్ దురాలోచన చేసింది. భారత్ భూముల స్వాధీనం కోసం పాక్ దురాలోచన చేసింది' అని మోదీ వ్యాఖ్యానించారు. సైనికుల త్యాగాలను యువత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని మోదీ అన్నారు.

కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఆగస్ట్‌ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైరస్‌ నుంచి స్వేచ్చ కోసం ప్రజలు ప్రతినబూనాలన్నారు. వైరస్‌ తీవ్రత ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాలతో పోలిస్తే దేశంలో మరణాల రేటు తక్కువగానే ఉందని, ఇంకా వైరస్‌ ముప్పు ముగియలేదన్నారు. రాఖీ పండుగ రానుందని, పలు సంఘాలు..ప్రజలు రక్షాబంధన్‌ను ఈసారి విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నించడం హర్షణీయమని అన్నారు.

Next Story
Share it