కార్గిల్ విజయ్ దివస్‌.. భారత్‌ -పాకిస్థాన్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా..?

By సుభాష్  Published on  26 July 2020 5:44 AM GMT
కార్గిల్ విజయ్ దివస్‌.. భారత్‌ -పాకిస్థాన్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా..?

1999లో కాశ్మీర్‌లోని కార్గిల్‌ను దురాక్రమణ చేసిన పాకిస్థాన్‌ ఆర్మీపై భారత సైన్యం వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. పాక్ సైన్యాన్ని ఓడించి కార్గిల్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది భారత్. ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైనట్లు 1999 జులై 26న భారత్ అధికారికంగా ప్రకటించింది. ప్రతియేటా కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటూ...కార్గిల్ అమరవీరుల త్యాగాలను భారత్ స్మరించుకుంటోంది.

ఈ రోజుల్లో యుద్ధాలు జరగడం అన్నది సాధారణ విషయం కాదు. యుద్ధం జరిగితే అన్ని దేశాలకూ నష్టమే. ఎంతో మంది జవాన్లు అమరులైపోతారు. ఆస్తి నష్టమూ తప్పదు. యుద్ధాల వల్ల కలిసొచ్చేదేమీ లేదు. అలాంటిది... పాకిస్థాన్ ప్రేరేపిత చర్యల వల్ల... కార్గిల్ యద్ధం జరగక తప్పలేదు. 1999 మే 3 నుంచి జులై 26 మధ్య కార్గిల్ జిల్లాలో... వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య జరిగింది యుద్ధం. దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్ నేమ్... ఆపరేషన్ విజయ్. కార్గిల్ సెక్టార్‌లో పాక్ చొరబాటుదారుల్ని, సైన్యాన్నీ తిప్పికొట్టడమే ఈ వార్ ముఖ్య లక్ష్యం. అప్పటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగకూడదని ఎదురు చూసినా, అప్పటికీ పాక్ కవ్వింపు చర్యలు ఆగకపోవడంతో చివరకు యుద్ధానికి దిగింది.

గడ్డకట్టే చలిలో పర్వతాల్లో ఏమాత్రం సహకరించని వాతావరణంలో దాదాపు 60 రోజులపాటూ రెండు దేశాల మధ్య‌ యుద్ధం జరిగింది. రెండువైపులా ఎంతో మంది సైనికులు ప్రాణాలు విడిచారు. భారత భూభాగంలోకి ఎంటరైన పాక్ సైన్యాన్ని తిప్పికొట్టి మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్... కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. అది జులై 26, 1999. దాన్ని కార్గిల్ విజయ్ దివస్‌గా ఏటా జరుపుకుంటున్నాం.

కార్గిల్ విజయ దివస్ రోజున మనం అమరులైన సైనికుల్ని తలచుకుంటాం. వారి పోరాట పటిమనూ, త్యాగశీలతనూ స్మరించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలంతా వాటిలో పాల్గొని సైనికులకు వందనాలు సమర్పిస్తారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్థాన్ మధ్య శాంతియుత లాహోర్ ఒప్పందం జరిగింది. తద్వారా జమ్మూకాశ్మీర్ విషయంలో రెండు దేశాలూ దౌత్యపరంగా, శాంతియుతంగా పరిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. కానీ పాకిస్థాన్ సైన్యం కుట్రలు పన్ని ఉగ్రవాద మూకల్ని భారత భూభాగంలోకి పంపాయి. దానికి ఆపరేషన్ బదర్ అనే పేరు పెట్టాయి. కాశ్మీర్, లఢక్ మధ్య లింక్ తెగ్గొట్టి... సియాచిన్ హిమ పర్వతాల నుంచి భారత్ సైన్యాన్ని పంపేయాలన్నది పాక్ కుట్ర.

1999, జులై 26న ముగిసిన కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. నాటి యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. నాటి యుద్ధంలో సుమారు 4వేల మంది పాకిస్తాన్ సైనికులను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. అయితే 1999 మే 3 నుంచి జులై 26 వరకు యుద్ధం జ‌రిపి పాక్ సైన్యాన్ని ఓడించిన తర్వాత కార్గిల్ వార్‌లో భారత్ గెలిచినట్లు అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయీ అధికారికంగా ప్రకటించారు. వారే గనక వీరోచితంగా పోరాడకపోయి ఉంటే ఈ రోజున మన జమ్మూకాశ్మీర్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో శాంతి యుత పరిస్థితులు ఉండేవి కావేమో. అందుకే మనం కార్గిల్ విజయ్ దివస్ ఏటా జరుపుకొంటున్నాయి.

Next Story
Share it