పిల్లలమర్రిని బ్రతికించారు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
మహబూబ్ నగర్ జిల్లాలోని 'పిల్లలమర్రి' చెట్టు బాగా ప్రసిద్ధి. 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన చెట్టు అది. దాదాపు మూడున్నర ఎకరాల్లో ఆ మర్రిచెట్టు విస్తరించింది. గత కొన్నేళ్లుగా ఆ మర్రి చెట్టు బ్రతుకుతుందో లేదో అని అందరూ భయపడ్డారు. చెదల బారిన పడి కూలిపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రిని బ్రతికించుకోడానికి చాలా కష్టాలు పడ్డారు. దేశంలోని అతి పెద్ద చెట్లలో మూడో స్థానంలో ఉన్న పిల్లలమర్రిని బ్రతికించాలని కొన్ని సంవత్సరాలుగా అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు.. కానీ ఏదీ సఫలం అవ్వలేదు.
చివరి ప్రయత్నంగా పిల్లలమర్రి మీద పంచగవ్య మిశ్రమాన్ని రెండు వారాల కిందట జల్లారు. ఈ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది. తాజాగా పిల్లలమర్రి ఆకులతో కళకళలాడడంతో అధికారుల మోములో ఆనందం వెలసింది. శతాబ్దాల చరిత్ర గల పిల్లలమర్రిని రక్షించుకున్నామని అంటున్నారు.
ఇటీవలి కాలంలో పిల్లలమర్రి పరిస్థితి దారుణంగా తయారైందని అధికారులకు తెలిసింది. కొన్ని దశాబ్దాలుగా పిల్లలమర్రి ఫంగస్ బారిన పడింది. డిసెంబర్ 2017లో పిల్లలమర్రి కొమ్మ విరిగిపోవడంతో ఈ వృక్షాన్ని కాపాడాలని బాధ్యతలను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతుల్లో పెట్టారు. 2018 జనవరి నుండి పిల్లలమర్రిని కాపాడడానికి అధికారులు యాక్షన్ ప్లాన్ ను మొదలుపెట్టారు. మెహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పిల్లలమర్రి ఉనికి కాపాడాలని నిర్ణయించుకున్నారు.
మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మనోరంజన్ భంజా పిల్లలమర్రిపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు. మనోరంజన్ భాంజా సూచనలు తీసుకోని వాటిని పాటించడం ద్వారా పిల్లల మర్రి చెట్టుకు మళ్ళీ ప్రాణం పోసారు అధికారులు.ఇక ఆ మర్రిచెట్టు కి చెదలు ఫంగస్ పూర్తిగా తొలగించే ప్రయత్నంలో భాగంగా క్లోరో ఫైర్ఫాక్స్ స్ప్రే ను ఉపయోగించారు. అలాగే కొమ్మలకు నాలుగు అంగుళాల మేర రంధ్రం చేసి క్లోరిపైరిఫాస్ ను సెలైన్ అందజేశారు. విరిగిపోయిన పెద్దపెద్ద కొమ్మలను వాటిని కూడా సిమెంట్ దిమ్మ ద్వారా చెట్టు కు సపోర్ట్ అందించారు అధికారులు.
క్లోరిపైరిఫాస్ సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో అధికారులు వేరే మార్గంలో చెట్టును రక్షించాలని భావించారు. అందులో భాగంగానే పంచగవ్యను పిల్లలమర్రి కోసం ఉపయోగించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తోంది. పిల్లలమర్రి మునుపటిలా పచ్చగా కళకళలాడుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆర్గానిక్ క్రిమిసంహారకాలను వాడాలని భావిస్తున్నారు.