ఫార్మా విద్యార్థిని డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం.. నిందితులెవరు..?

By అంజి  Published on  14 Dec 2019 6:04 AM GMT
ఫార్మా విద్యార్థిని డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం.. నిందితులెవరు..?

ముఖ్యాంశాలు

  • చెంచుపేటలో ఫార్మా విద్యార్థిని మృతదేహానికి రీ పోస్టుమార్టం
  • ఎముకలు, గోర్లు వెంట్రుకలు సేకరించిన ఫోరెన్సిక్‌ అధికారులు

గుంటూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మా విద్యార్థి కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులను గుర్తించి వారిని శిక్షించేందుకు సీబీఐ దూకుడు పెంచింది. చెంచుపేటలోని ఫార్మా విద్యార్థి డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈద్గాలోని ఫార్మా విద్యార్థిని సమాధి దగ్గర అధికారులు తవ్వకాలు జరిపారు. తెనాలి రెవెన్యూ అధికారులతో కలిసి వైద్య బృందం రీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. రీ పోస్టుమార్టం వీడియోను సీబీఐ బృందం కోర్టుకు సమర్పించనుంది. ఇప్పటికే చెంచుపేట పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

12 ఏళ్ల క్రితం ఫార్మా విద్యార్థిని అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. అప్పటి పోలీసులు, డీఎన్‌ఏ అందించిన ఆధారాలు అసలు ఫార్మా విద్యార్థివేనా అనే అనుమానం రావడంతో సీబీఐ మళ్లీ రీ పోస్టుమార్టం చేస్తోంది. ఇక ఈ కేసులో సత్యంబాబు, హాస్టల్‌ వార్డెన్‌ పద్మ భర్త శివరామకృష్ణను హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు కోనేరు సతీష్‌, అబ్బూరి గణేష్‌, చింత పవన్‌, సురేష్‌, రాజేశ్‌ ఉన్నారని ఫార్మా విద్యార్థి తల్లి శంషాద్‌ బేగం ఆరోపిస్తున్నారు. రీ పోస్టుమార్టం తమ మత ఆచారాలకు విరుద్ధం అయినప్పటికీ కేసు ముందుకు సాగేందుకు అంగీకరించామని తల్లి శంషాద్‌ బేగం తెలిపారు.

తమ కూతురు న్యాయం జరుగుతుందంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని ఫార్మా విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆయేషా రీ పోస్టుమార్టంకు మొదటగా మత పెద్దలు అంగీకరించలేదు. పోస్టుమార్టం నిర్వహించేందకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి తెలపడంతో ఫార్మా విద్యార్థిని హత్య కేసు సమయంలోన పని చేసిన పోలీసులను సీబీఐ అధికారులు ప్రశ్నించి.. వాళ్ల స్టేట్మెంట్లను రికార్డు చేశారు.

Next Story
Share it