కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో తీన్మార్ మల్లన్న పిటిషన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2020 6:59 AM GMTగడిచిన కొద్ది రోజులుగా ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యన సోషల్ మీడియాతో పాటు.. కొన్ని వెబ్ పత్రికల్లో కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలిందని.. దీంతో ఆయన ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇలాంటి వార్తల్ని సీఎంవో ఖండిస్తుంటుంది. తాజా ఎపిసోడ్ లో అలాంటిదేమీ జరగకపోగా.. ఒక పత్రిక యజమానిని అనూహ్యంగా టాస్క్ ఫోర్సు పోలీసులు ఖమ్మంలో అదుపులోకి తీసుకొని జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. అంతే తప్పించి.. ముఖ్యమంత్రి ఆరోగ్యం బ్రహ్మండంగా ఉందన్న స్టేట్ మెంట్ ఎవరూ విడుదల చేసింది లేదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సీఎంను తరచూ తన చురకలతో ఇబ్బంది పెట్టే తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటూ మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లోని సిబ్బందిలో 30 మంది పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.. దీంతో ముఖ్యమంత్రి ఫాంహౌస్ కు వెళ్లినట్లుగా ప్రచారం సాగుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉంది? అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరి తీన్మార్ మల్లన్న పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? ఒకవేళ తీసుకుంటే హైకోర్టు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఎదురయ్యే ప్రశ్నలకు ఏమిటి? అన్నవే కాదు.. సీఎం ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఆన్ రికార్డెడ్ గా నమోదవుతుందన్న మాట వినిపిస్తుంది. మరి..ఈ పిటిషన్ పై కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.