కరోనా కంటే.. ఆ భయమే ఎక్కువమందిని చంపేస్తుందట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 5:56 AM GMT
కరోనా కంటే.. ఆ భయమే ఎక్కువమందిని చంపేస్తుందట

నమ్మరు కానీ ఇది నిజం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా జరిగే నష్టం కంటే.. దాని భయమే చాలామంది ప్రాణాల్ని తీస్తుందన్న విషయం తాజాగా బయటకు వస్తోంది. కరోనా టెస్టు చేయించుకున్నాక.. పాజిటివ్ అని తేలితే చాలు.. ఒక్కసారిగా ఆందోళనకు గురి కావటం కనిపిస్తుంది. మాయదారి రోగం కమ్మేసింది.. నాకేమవుతుంది? నా కుటుంబానికి దిక్కెవరు? లాంటి వేదనలతో జరగరాని నష్టం జరుగుతుందని చెబుతున్నారు. దీని కంటే కూడా.. నేను దీన్ని జయిస్తాను? ఈ మాయదారి వైరస్ నన్నేమీ చేయలేదన్న భావన చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు.

దీనికి ఉదాహరణగా వైద్య నిపుణులు పలు ఉదాహరణలు చెబుతున్నారు. భయపడుతూ బతికే వాడికి చిన్నపాటి అల్సర్ కూడా ప్రాణాపాయంగా మారుతుందని.. తెగించినోడు కేన్సర్ ను సైతం జయిస్తాడన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. అందుకే.. కరోనా విషయంలో భయం దాన్ని అధిగమించేందుకు అడ్డుకుంటుందని.. పాజిటివ్ అని తేలినా.. స్థైర్యంతో నాకేం కాదన్న ధీమా వైరస్ ను తేలిగ్గా జయించేందుకు కారణమవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

కరోనా సోకిందన్న విషయం పరీక్షలో తేలిన వెంటనే అస్సలు భయపడాల్సిన అవసరం లేదని.. కంగారు అసలే అక్కర్లేదని చెబుతున్నారు. కరోనాకు చికిత్స చేసే గాంధీ వైద్యులు రోగుల గురించి.. వారికిచ్చే ట్రీట్ మెంట్ గురించి మాట్లాడే సమయంలో.. ఒక విషయాన్ని ఇటీవల తరచూ ప్రస్తావిస్తున్నారు. తమ వద్దకువచ్చే పేషెంట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని.. మాయదారి రోగం తమను పట్టేసిందన్న ఆందోళనతో వారు కుంగిపోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ కారణంతో వారిలో చురుకుదనం తగ్గిపోవటం.. వ్యాధి నయమైన తర్వాత కూడా తమను అంటరాని వారిగా చూస్తారన్న భయాందోళనలు చాలామందిలో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా నయమవుతుందో లేదో అన్న ఇరిటబిలిటీ డిజార్డర్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఇలాంటి వారు నిరాశతో పాటు తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోవటం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రతి విషయానికి చిరాకు పడటం.. అందరిపైనా కసురుకోవటం.. కోపంగా మాట్లాడటం లాంటివి చేయటంతో పాటు.. వైద్యులు చెప్పిన మందుల్ని సరిగా వాడే విషయంలోనూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు.

రోగి ఎప్పుడైతే భయపడి కుంగిపోతారో.. అతడిలో రోగనిరోధక శక్తి తగ్గటం మొదలవుతుందని.. ఇది ప్రమాదకరమని చెబుతున్నారు. వైరస్ మీద పోరాటంలో మానసిక స్థైర్యం చాలా అవసరమని చెబుతున్నారు. కుమిలిపోవటం.. భయపడిపోవటంతో ప్రాణాల్ని నిలుపుకోవటం కష్టమంటున్నారు. ఈ కారణంతోనే కరోనా రోగులకు సైకాలజిస్టుల చేత కౌన్సెలింగ్ చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవటంతో వారిలో ధైర్యం నింపేందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇదో సమస్యగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సో.. కరోనా సోకిన వెంటనే స్థైర్యాన్ని కోల్పోకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Next Story